దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు

ఢిల్లీ, మార్చి 10 : 17 వ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించారు. మే 23న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లు అరోరా తెలిపారు. షెడ్యూల్‌ ప్రకటనతో తక్షణమే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని అరోరా పేర్కొన్నారు.

జున్ మూడుతో ప్రస్తుత లోక్ సభ కాలపరిమితి ముగుస్తుందని చెప్పిన అరోరా..స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఎన్నికల సన్నద్ధత, నిర్వహణపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల సంఘాలు, ప్రభుత్వాలతో పలు దఫాలుగా సన్నాహక సమావేశాలు జరిపామని అరోరా తెలిపారు. శాంతి భద్రతలు, బలగాల మోహరింపుపై చర్చలు జరిపామని ఆయన చెప్పారు.

పరీక్షలు ,పండుగలుకి సంబంధించిన తేదిలను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ రూపొందించామని అరోరా తెలిపారు. వాతావరణం, పంటకోతల సమయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని ఆయన అన్నారు.

దేశ వ్యాప్తంగా గా 90 కోట్లు మంది ఓటర్లు ఉన్నారని అరోరా చెప్పారు. 2014 తరువాత 8.4 కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారని ఆయన అన్నారు. 1 .5 కోట్ల మంది మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారని అరోరా తెలిపారు. సుమారు పది లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.

1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఓటును చెక్ చేసుకోవచ్చని, ఫిర్యాదులు కూడా చేయవచ్చని అరోరా అన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి 12 రకాల గుర్తింపు కార్డులను అనుమతిస్తామని అరోరా స్పష్టం చేశారు. పోలింగ్ కు ఐదు రోజుల ముందు ఓటర్ స్లీప్ లు పంపిణి జరుగుతుందని తెలిపారు. ఓటర్ స్లిప్ ను ఐడి కార్డుగా పరిగణించారని అరోరా పేర్కొన్నారు.

ఈవీఎంల‌పై అభ్యర్థుల ఫోటోలు ఉంటాయని అరోరా అన్నారు. అన్ని చోట్ల ఈవీఎంతో వివి ప్యాట్‌లను ఉపయోగిస్తామని అరోరా తెలిపారు. తుది ఓటరు జాబితా ప్రకటించాక మార్పులు చేర్పులు ఉండవని అరోరా వెల్లడించారు.

రాత్రి పది నుండి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్‌లకు అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు. కోడ్ ఉల్లంగిస్తే కఠిన చర్యలుంటాయని అరోరా హెచ్చరించారు. కోడ్ ఉల్లంఘనపై ప్రజలే నేరుగా ఎన్నికల కమీషన్‌‌కు ఫిర్యాదు చేయ్యవచ్చు. ఫిర్యాదు కొరకు ప్రత్యేక యాప్‌ ఉందని ఆయన తెలిపారు.

అభ్యర్థుల సోషల్ మీడియా ఎకౌంటులకు కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుందని అరోరా అన్నారు. సోషల్‌ మీడియా కూడా ఎలక్షన్ కమీషన్ పర్యవేక్షణలో ఉంటుందనీ, సోషల్ మీడియాలో తప్పడు ప్రచారం చేయరాదని అరోరా పేర్కొన్నారు.

మొత్తం ఏడు దశల్లో జరగనున్న పోలింగ్ కు మార్చి 18 ని మొదటి నోటిఫికేషన్ విడుదలవుతుందని అరోరా తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్ :

  • మొదటి విడత ఎన్నికలు: ఏప్రిల్ 11న 20 రాష్ట్రాల్లోని 91 నియోజకవర్గాలు
  • రెండవ విడత ఎన్నికలు: ఏప్రిల్ 18న 13 రాష్ట్రాల్లోని 97 నియోజకవర్గాలు
  • మూడవ విడత ఎన్నికలు: ఏప్రిల్ 23 న 14 రాష్ట్రాల్లోని 115 నియోజకవర్గాలు
  • నాలుగవ విడత ఎన్నికలు: ఏప్రిల్ 27న 9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాలు
  • ఐదవ విడత ఎన్నికలు: మే 6న 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాలు
  • ఆరవ విడత ఎన్నికలు: మే 12న 7 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాలు
  • ఏడవ విడత ఎన్నికలు: మే 19న 8 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాలు