నాగ్ పూర్: యూట్యూబ్ ఉంటే చాలు. ఇట్టే సమాచారమంతా మన ముందు పెట్టేస్తుంది. అయితే కొంతమంది దీన్ని అసాంఘిక కార్యకలాపాలు చేసేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. మంచి విషయాలు తెలుసుకోవడానికే గాకుండా దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకోవడానికి యూట్యూబ్‌ను చూస్తున్నారు. యూట్యూబ్ చూసి దోపిడీలు, దొంగతనాలు కూడా చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఓ జంట ఇలాంటి ప్రయత్నమే చేసి పోలీసులకు చిక్కారు. వివరాల్లోకి వెళితే.. హజియాపహాద్ కు చెందిన శైలేష్(29), అతని భాగస్వామి గౌరీ గోమాడే(21) కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. దొంగతనాలు చేసి విలాసవంతంగా జీవించాలని భావించారు. దీంతో దొంగతనాలు ఎలా చేయాలో యూట్యూబ్ లో చూడటం మొదలు పెట్టారు. ఇంటి కిటికీ పడగొట్టడం, గ్యాస్ కట్టర్ తో ఇంటి తలుపులు పలగొట్టడం వంటి చూశారు. దీనిని ఇంట్లోనే ప్రయత్నించారు. అనంతరం దొంగతనం చేయడం ప్రారంభించారు. వారు ఉంటున్న ప్రాంతంలోని ఇళ్లను టార్గెట్ చేస్తూ.. నెలలో రెండు, మూడు ఇళ్లలో చొరబడి అందినంత దోచుకుపోయారు. గత ఏప్రిల్ లో మంకాపూర్ అనే ప్రాంతంలోని ఓ ఇంటి నుంచి రెండు లక్షలు దోచుకున్నారు. అయితే, మంగళవారం ఈ జంటను పోలీసులు అరెస్టు చేశారు. గ్యాస్ కట్టర్, ఆక్సిజన్ సిలిండర్లతోపాటు దొంగతనాలకు ఉపయోగించే ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ జంట యూట్యూబ్ చూసి ఏటీఎం చోరీకి కూడా ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.
previous post
next post