కేరళను కుదిపేసిన నటుడి నిరసన!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అతనో ‘థర్డ్ రేట్’ నటుడు. అతనితో నేను వేదిక పంచుకోను అన్నాడు ఒక సినిమా డైరెక్టర్. ఆ ‘పనికి రాని’ నటుడి స్పందన ఏమిటో తెలుసా? నేరుగా వెళ్లి వేదిక ఎక్కి కింద కూర్చున్నాడు. ‘’నేను అగ్ర కులాలకు చెందిన వాడిని కాదు. నాకు ఏ జాతీయ అవార్డు రాలేదు. సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు ధరించాను. కులం, మతం ఏమిటనేది పక్కన పెడితే నేను కూడా మనిషినే ‘’ ఇలా సాగింది ఆ నటుడి ఆక్రోశం. సభయావత్తు అవాక్కయిపోయింది. పాలక్కాడ్ లో జరిగిన ఈ సంఘటన కేరళలో సంచలనం కలిగించింది.

ఆ థర్డ్ రేట్ నటుడి పేరు బినీష్ బస్తిన్.  అతనిని అవమానించిన దర్శకుడి పేరు అనిల్ రాధాకృష్ణన్ మీనన్. వీరిద్దరినీ పాలక్కాడ్ ప్రభుత్వ మేడికల్ కళాశాలలో ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు. అందులో బస్తిన్ ముఖ్య అతిథి. మీనన్ ఒక పుస్తకాన్ని ఆవిష్కరించాలి. బస్తిన్ తో కలిసి స్టేజి మీద కూర్చునేందుకు మీనన్ నిరాకరిండంతో కార్యక్రమ నిర్వహకులు పుస్తకావిష్కరణ తర్వాత వేదికపైకి రావాలని బస్తన్ కు సూచించారు. ఈ పరాభావాన్ని తట్టుకోలేని బస్తిన్ వేదికపైకి వెళ్లి కింద కూర్చుని మాట్లాడుతూ నిరసన తెలిపాడు. ఈ సంఘట సంచలనం సృష్టించడంతో దర్శకుడు మీనన్ నష్టనివారణకు ప్రయత్నించాడు. తాను బస్తిన్ తో కలిసి ఒకే వేదికపై కూర్చునేందుకు నిరాకరించలేదని ఒక టీవీ ఛానల్ లో అన్నాడు. ఐ యామ్ సారీ బస్తిన్ అని కూడా అన్నాడు.

ఈ సంఘటన కేరళలో తీవ్రమైన చర్చకు దారి తీసింది. మీనన్ పైనే కాక మెడికల్ కాలేజి యాజమాన్యంపై, కార్యక్రమం నిర్వహకులైన స్టూడెంట్స్ యూనియన్ పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. సంఘటన వీడియో వైరల్ గా మారింది. సినిమా ఉద్యోగులు సమాఖ్య మీనన్ నుంచి వివరణ కోరింది. బస్తిన్ ను అవమానించినట్టు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేరళ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎకె బాలన్ చెప్పారు.