ఏపీలో మళ్లీ పడగవిప్పిన కాల్‌మనీ భూతం!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కలకలం రేపిన కాల్ మనీ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కాల్ మనీ వేధింపులు తాళలేక గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాల్‌మనీ వ్యవహారంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆవేదనతో ఉండవల్లికి చెందిన వెంకటేష్ అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్పందించిన పోలీసులు, స్థానికులు ఆయన్ని అడ్డుకున్నారు.

గోపాలం సాంబశివరావు అనే వ్యక్తి అధిక వడ్డీల పేరుతో వేధిస్తున్నాడని, ఆరు లక్షల రూపాయలు తీసుకున్న తన వద్ద నుంచి ఇప్పటి వరకూ ఇరవై మూడు లక్షల రూపాయలు వడ్డీల రూపంలో వసూలు చేశారని ఆరోపించాడు. తనకు డబ్బులు ఇచ్చినప్పుడు మూడు రూపాయల వడ్డీ అని చెప్పి పన్నెండు రూపాయల చొప్పున వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని సదరు వ్యాపారి బెదిరించినట్టు ఆరోపించాడు. కాల్ మనీ వ్యవహారంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, పైగా దుర్భాషలాడారని బాధితుడు వాపోయాడు. కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మూడేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వ హయాంలో కాల్ మనీ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. విజయవాడ కేంద్రంగా కాల్ మనీ వ్యవహారం జరిగినట్లుగా అప్పట్లో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై అప్పటి ప్రతిపక్ష పార్టీ, ప్రస్తుత అధికార వైసీపీ కూడా గట్టిగా పోరాటం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటాం అని కూడా ప్రకటించింది. అయితే, తాజాగా రాజధాని అమరావతి పరిధిలో కాల్ మనీ వ్యవహారాలు వెలుగులోకి రావడం గమనార్హం.