కుటుంబం కాలిపోతున్నా..!

న్యూఢిల్లీ: కారులో వెనకవైపు మంటలు చెలరేగాయి. వెనుక సీట్లో తన కుటుంబం ఉంది. వాళ్ల ప్రాణాలకు ప్రమాదమని ఆ తండ్రికి తెలుసు. అయినా, మిగిలిన వాహనాలకు ప్రమాదం వాటిల్లకూడదనే అనుకున్నారు. ముందుగా మంటలు చెలరేగిన కారును ఫ్లైఓవర్ మీద ఒక పక్కకు తీసుకెళ్లారు. ఆ తర్వాతే వారిని కాపాడే ప్రయత్నం చేశారు. గుండెల్ని పిండిచేసే ఈ హృదయవిదారక ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. అక్షర్ ధాం ఫ్లైఓవర్ మీద కాలిపోతున్న కారును మధ్యలో ఆపితే చాలా వాహనాలకు మంటలు అంటుకునేవి. కానీ ఉపేంద్ర మిశ్రా అలా చేయలేదు. కారు వెనక మంట అంటుకున్నట్లు గమనించగానే నెమ్మదిగా ఫుట్ పాత్ వైపు కారు నడిపించారని అక్కడకు సమీపంలో ఉన్న బబ్లూకుమార్ చెప్పాడు. అప్పటికే కారు సగానికి పైగా మంటలు అంటుకున్నాయి. ఉపేంద్ర మిశ్రా వెంటనే బయటకు దూకి, ముందుసీట్లో తన పక్కన కూర్చున్న కూతుర్ని బయటకు లాగాడు. వెనక తలుపును ఎలాగోలా పగలగొట్టి తీయాలని రోడ్డు మీద వెళ్తున్నవారు కూడా ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

కారు పేలిపోతుందన్న భయంతో అంతా దూరం జరిగారు. తన కుటుంబాన్ని కాపాడేందుకు వెనక తలుపులు తీయాలని మిశ్రా చాలా ప్రయత్నం చేశారు. కానీ అతడికి కూడా మంటలు అంటుకుంటాయన్న భయంతో జనం అతడిని వెనక్కి లాగేశారు. సాయం కోసం మిశ్రా గట్టిగా ఏడుస్తూ అందరినీ ప్రార్థించాడు. అతడి ఏడుపు అందరినీ కదిలించింది గానీ, ఏ ఒక్కరూ ధైర్యం చేసి ముందడుగు వేయలేకపోయారు. వేడి బాగా ఎక్కువగా ఉండటంతో కారు సమీపానికి కూడా వెళ్లలేకపోయామని ప్రమాదస్థలిలో ఉన్న కరణ్ శంకర్ అనే మరో సాక్షి చెప్పారు. వెనక తలుపులు లోపలి నుంచి లాక్ చేసుకుని ఉంటారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. లోపల కూర్చున్నవారి శరీరాలు కాలి బొగ్గులా మారిపోయాయి. దాంతో వారిని గుర్తించడం కూడా సాధ్యం కావడం లేదు. ఈ విషయాన్ని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రి సిబ్బంది చెప్పారు.

ప్రమాదం జరిగిన కాసేపటికి ట్రాఫిక్ పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారని ఓ ఆటోడ్రైవర్ చెప్పారు. ఫ్లైఓవర్ ఒకవైపంతా ట్రాఫిక్ ఆగిపోయిందని, ఆ తర్వాత పోలీసులు, ఫైర్ సిబ్బంది, అంబులెన్సు వచ్చాయని అన్నారు. మంటలు ఆపిన తర్వాత క్రేనుతో కారును పక్కకు తీశారని ప్రశాంత్ కశ్యప్ అనే మరో ఆటోడ్రైవర్ చెప్పారు. మిశ్రాది సొంత కారు. ఆన్ లైన్ లో సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే కంపెనీకి దాన్ని నడుపుతారు. ఆదివారం కావడంతో కుటుబంతో బయటకు వెళ్లారు. ఆయన బాగా షాకయ్యారని డీసీపీ జస్మీత్ సింగ్ చెప్పారు.