హర్యానా గద్దెపై మళ్ళీ ఖట్టర్!

చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రిగా రెండోసారి మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్ లోని రాజ్‌భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఖట్టర్ తోపాటు జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి. నడ్డా, అకాలీ దళ్ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్, కాంగ్రెస్ నేత భూపేందర్‌సింగ్ హుడాతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఖట్టర్ సీఎంగా వ్యవహరించడం ఇది రెండోసారి. గత ప్రభుత్వంలోనూ ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 40 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. 10 స్థానాల్లో గెలుపొందిన దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీ బలం 57కి పెరిగింది.

ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ హర్యానాలో 10 పార్లమెంటరీ సీట్లనూ గెలుచుకుంది. ఈసారి శాసన సభ ఎన్నికల్లో 75 సీట్లు వస్తాయని ఆశించింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు భిన్నంగా హర్యానాలో బిజెపి 40 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ పార్టీకి చెందిన పది మంది మంత్రుల్లో ఎనిమిది మంది ఓడిపోయారు.

మరోవైపు ఉపాధ్యాయుల నియామకంలో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగంతో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అజయ్ చౌతాలా (దుష్యంత్ చౌతాలా తండ్రి) ఆదివారం జైలు నుంచి రెండు వారాల పెరోల్ పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తండ్రి పేరుతోనే సహజంగానే కుమారుడి పేరు ప్రచారంలోకి వస్తుందని, అయితే పార్టీ కార్యకర్తలతో కలిసి దుష్యంత్ కేవలం 11 నెలలో పార్టీని స్థాపించారని, పార్టీ కార్యకర్తల కృషితో పార్టీ ఇవాళ వృద్ధిలోకి వచ్చిందని అన్నారు. తన సలహా తీసుకోకుండా దుష్యంత్ ఏ నిర్ణయం తీసుకోడని, బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ముందు తనను కలుసుకున్నాడని, పొత్తుకు తాను సమ్మతి తెలిపానని అజయ్ చౌతాలా చెప్పారు. గత శుక్రవారం  తీహార్ జైలులో అజయ్ చౌతాలాను దుష్యంత్ కలుసుకున్నారు. అనంతరం బీజేపీకి మద్దతు ప్రకటించారు.

నిజానికి కాంగ్రెస్‌ పార్టీ దుష్యంత్‌కు సిఎం పదవిని ఆఫర్‌ చేసింది. అయితే అనూహ్యంగా దుష్యంత్ బీజేపీకి మద్దతు పలికారు. తన తండ్రి అజయ్ చౌతాలాలను కేసుల నుంచి విముక్తులను చేసి జైలు నుంచి విడుదల చేస్తే మద్దతు ఉంటుందని బీజేపీకి మెలిక పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన తండ్రి జైలు నుంచి విడుదల అయ్యారని తెలుస్తోంది.