సీఎంగా ఖట్టర్.. డిప్యూటీగా దుశ్యంత్!

చండీగఢ్: హర్యానాలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఆదివారం కొలువుదీరనుంది. జన్ నాయక్ జనతా పార్టీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలంటూ రాష్ట్ర గవర్నర్ ను మనోహర్ లాల్ ఖట్టర్ కోరారు. ఇందుకు అంగీకరించిన గవర్నర్ సత్యదేవ్ నరైన్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దీంతో మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా జన్ నాయక్ జనతా పార్టీ అధ్యక్షుడు దుశ్యంత్ చౌతలా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, ఖట్టర్ మంత్రివర్గంలో ఎవరికి స్థానం దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది.

మరోవైపు ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న దుశ్యంత్ చౌతలా తండ్రి అజయ్ చౌతలాకు ఫర్లో దక్కింది. ఫర్లో అంటే.. ఏడాదిలో రెండు వారాల పాటు ఖైదీలు సెలవు తీసుకోవడం. అజయ్‌కు రెండు వారాల పాటు ఫర్లో మంజూరు చేస్తున్నట్లు తీహార్ జైలు డీజీ తెలిపారు. దాంతో శనివారం సాయంత్రం గానీ, ఆదివారం ఉదయం గానీ ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. కుమారుడు దుశ్యంత్ చౌతలా ప్రమాణస్వీకారానికి అజయ్ చౌతలా హాజరుకానున్నారు.

గురువారం వెల్లడైన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ అధికారాన్ని చేపట్టే మెజార్టీ రాలేదు. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా..ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు అవసరం. 40 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను మాత్రం అందుకోలేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు భిన్నంగా హర్యానాలో బిజెపి కంగు తినగా, మహారాష్ట్రలో శివసేనతో కలిసి అది అతి కష్టం మీద గట్టెక్కింది. హర్యానాలో కాంగ్రెస్‌ పార్టీ బాగా పుంజుకోని 31 స్థానాలు తెచ్చుకుంది. గత ఎన్నికల కన్నా అదనంగా 16 స్థానాలు తెచ్చుకుంది. గత ఎన్నికల్లో 47 స్థానాలు తెచ్చుకున్న బిజెపి ఈసారి 40 స్థానాల వద్దే ఆగిపోయింది. దుశ్యంత్ చౌతాలా నేతృత్వంలోని జెజెపి పార్టీ 10 స్థానాలు గెల్చుకొని కీలకంగా మారింది. ఇతరులకు తొమ్మిది స్థానాలు లభించాయి. దుశ్యంత్ ను తమ వైపు తిప్పుకునేందుకు బిజెపి, కాంగ్రెస్‌లు ప్రయత్నించాయి. కాంగ్రెస్‌ పార్టీ ఒక అడుగు ముందుకెసి దుష్యంత్‌కు సిఎం పదవిని ఆఫర్‌ చేసింది. అయితే అనూహ్యంగా దుశ్యంత్ బీజేపీకి మద్దతు పలికారు. తన తండ్రి అజయ్ చౌతాలాలను కేసుల నుంచి విముక్తులను చేసి జైలు నుంచి విడుదల చేస్తే మద్దతు ఉంటుందని బీజేపీకి మెలిక పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన తండ్రి జైలు నుంచి విడుదల అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.