వివేకా హత్యలో సందేహాలెన్నో!

వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు, మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి దారుణ హత్య సంచలనం సృష్టించింది. సార్వత్రిక ఎన్నికల ముంగిట ఇది జరగడం మరింతగా చర్చకూ, ఒక రకమైన భయాందోళనలకూ దారి తీసింది. అధికారపక్షం టిడిపికీ, ప్రధాన ప్రతిపక్షం వైసిపికీ మధ్య ముందు నుంచీ ఉప్పూ నిప్పూ వ్యవహారంగానే ఉంటూ వచ్చింది. రెండు పక్షాల మధ్యా కనీస ప్రజాస్వామిక మర్యాదలకు కూడా చోటు లేకుండా పోయింది.

ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ వైరం మరింత ముదిరింది. వోట్ల తొలగింపు వ్యవహారం, డేటా చోరీ కేసులతో వాతావరణం మరీ చెడిపోయింది. ఇప్పుడీ హత్యోదంతం ఎటు తిరిగి ఎటు పరిణమిస్తుందోనన్న భయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సంఘటన రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్న విషయం అలా ఉంచితే వివేకానంద రెడ్డి హత్య విషయంలో కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పులివెందులలో, వైఎస్ కుటుంబం కంచుకోటలో నేరుగా వివేకా ఇంటికి వెళ్లి ఆయనపై గొడ్డలితో దాడి చేసి దారుణంగా హతమార్చడం అక్కడి ప్రజలకు జీర్ణం కావడం లేదు. అంత సాహసం ఎవరు చేయగలరన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది.

ఉదయం 5:30 గంటల ప్రాంతంలో తాను వివేకా ఇంటికి వెళ్లినట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వివేకా నిద్రపోతున్నారన్న ఉద్దేశ్యంతో వేచి ఉండి దాదాపు గంట తర్వాత పక్క తలుపు తెరిచి ఉన్న సంగతి గమనించి లోపలకు వెళ్లారు. వివేకా వంటిపై ఉన్న గాయాలను గమనించినట్లు, ఆయన మృతి చెందినట్లు కృష్ణారెడ్డి ఫిర్యాదులోనే చెప్పారు.

తర్వాత కబురు తెలిసి కడప ఎంపి అవినాష్ రెడ్డి అక్కడకు వచ్చారు. వివేకా వంటిపై గొడ్డలితో నరికినట్లు చాలా బలమైన గాయాలు ఉన్నాయి. అక్కడ రక్తం విపరీతంగా కారింది. అటువంటి సీన్‌లో నుంచి అప్పటికే మరణించిన వివేకా మృతదేహాన్ని ఆసుపత్రికి ఎందుకు తీసుకువెళ్లారన్న ప్రశ్నకు సమాధానం లేదు.

వివేకా తలకు దుప్పటి కట్టి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తర్వాత కొద్ది గంటల తర్వాత పోలీసు సూపరింటెండెంట్ వచ్చి శవాన్ని పరిశీలించేవరకూ ఆయనకు అంత బలమైన గాయాలు ఉన్న విషయం బయటకే రాలేదు. ఎంత తీవ్రమైన గొడ్డలి దెబ్బలు తగిలిందీ తర్వాత శవపరీక్షలో తేలింది. వివేకా హత్యకు గురయిన విషయంపై స్పష్టత రావడానికి అన్ని గంటలు పట్టడం విచిత్రంగా ఉంది.

వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ విషయం కూడా చిత్రంగానే ఉంది. డ్రయివర్‌ను త్వరగా రమ్మనందుకు తనను చంపబోతున్నట్లు ఆ లేఖలో పెన్నుతో రాసి ఉందనీ, కుటుంబ సభ్యులే ఆ లేఖ పోలీసులకు అందించారనీ ఎస్‌పి చెప్పారు. ఆ లేఖ కూడా  పోలీసు సృష్టేనని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. ఇక్కడ పొంతన కుదరడం లేదు. ఈ విషయంలో వివేకా కుటుంబ సభ్యులు ఇంతవరకూ నోరు తెరవలేదు.

ఉదయమే వివేకా మృతి చెందిన వార్తతో పాటు ఆయన మృతికి గుండె పోటు కారణమన్న వార్త బయటకు వచ్చింది. అది ఎక్కడ పుట్టిందీ తెలియదు. వివేకానందరెడ్డికి సర్వదా వెన్నంటి ఉండే ఒక సహాయకుడు ఉన్నాడనీ, అతను కాణిపాకం యాత్రకు వెళ్లాడనీ చెబుతున్నారు. ఈ సమయంలో అతను లేకుండా పోవడం కాకతాళీయమా లేక కావాలని జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.