చిరంజీవి మళ్ళీ ఆ తప్పు చేస్తాడా…?

పోలికల్ మిర్రర్ 

ఈ మధ్య సామజిక మాధ్యమాల్లో ఒక వార్తా విపరీతంగా చక్కర్లు కొడుతోంది…! ప్రముఖ వెబ్ సైట్లు లోనూ, వెబ్ ఛానళ్లలోనూ, కొన్ని టివి ఛానళ్లలోనూ అదే వార్త చక్కర్లు కొడుతోంది. అదే చిరంజీవి వైసిపిలో చేరుతారని.., జగన్ ఆయనకు రాజ్యసభ ఇస్తారని.., వీలైతే కేంద్రమంత్రిగా కూడా అవకాశం ఇస్తారని…! పవన్ కళ్యాణ్ ని ఎదుర్కొనేందుకు జగన్ ఈ వ్యూహం పన్నారని తెగ ప్రచారం జరుగుతుంది. అసలు ఈ అవకాశం ఉందా? చిరంజీవికి ఆ అవకాశం ఉందా? జగన్ కి ఈ అవసరం ఉందా? ఈ ఇద్దరికీ అసలు ఈ ఆలోచన ఉందా? అనేది కొంచెం లోతుగా గమనిద్దాం.

జగన్ కి ఇప్పుడేం అవసరం…?

సీఎం జగన్ బిజెపితో సయోధ్యకు ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కాదనలేం…! ఎన్డీఏ లో చేరేందుకు ఉత్సాహం చూపించి ఉండొచ్చు, కొట్టిపారేయలేం…! ప్రస్తుత పరిస్థితుల్లో, కేసుల దృష్ట్యా జగన్ కి ఆ అవసరం ఉండొచ్చు, ఖండించలేం…! కానీ అందుకు చిరంజీవిని ఉపయోగించుకోవడం, ఆయనను కేంద్రానికి పంపించడం ద్వారా ప్రత్యేకంగా లాభపడతారు అనేదే విడ్డూరం. జగన్ కి ఇప్పుడు ఆ అవసరమూ లేదు. అయితే ఒక సామజిక వర్గాన్ని మరింత దగ్గర చేసుకునే క్రమంలో చిరంజీవిని తీసుకొస్తున్నారని, పవన్ కి వ్యతిరేకంగా దించుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కూడా జగన్ కి అంత అవసరమే లేదు. ప్రస్తుతం చిరంజీవికి రాజకీయంగా అంత పలుకుబడి లేదు. ఆయన సామజికవర్గంలో కూడా ఆయన పట్ల భిన్నంగానే ఉన్నారు. పవన్ పరిస్థితి అంతే. రాజకీయంగా అసలే సీన్ లేని చిరంజీవిని.., అంత కంటే సీన్ లేని పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోడానికి దించుతారన్న ప్రచారంలో అసలు వాస్తవమే లేదు. ఆ సామజిక వర్గంలో రాజకీయంగా పట్టున్న, రాష్ట్ర స్థాయిలో అందరికీ తెలిసిన ఆళ్ళ నాని, తోట త్రిమూర్తులు, ఆమంచి కృష్ణమోహన్ లాంటి నేతలు జగన్ వెంట ఉన్నారు. ఆ సామజిక వర్గంలో 70 శాతం వరకు జగన్ పట్ల ప్రస్తుతానికి సానుకూలంగానే ఉన్నారు. సో… ప్రస్తుతానికి ఈ చర్చ అనవసరం. ఇంకా జగన్ కు ఆ సామజిక వర్గ మద్దతు అవసరం, అనుకుంటే ముద్రగడని లాగే ప్రయత్నం చేయవచ్చు.

చిరు మళ్ళీ వస్తారా…!

ఇక చిరంజీవి విషయానికి వస్తే. “దూరాన ఉన్న సముద్ర కెరటం భలే ఉంటుంది. దగ్గరకు వచ్చే కొద్దీ దాని ఎత్తు పైకి లేచి ఆహ్లాదంగా ఉంటుంది. కానీ మరింత దగ్గరగా వచ్చి కాళ్ళ ముంగిట తుస్ మంటుంది” రాజకీయంగా చిరంజీవి పరిస్థితి ఇంతే. ఏదో సాధించాలని పార్టీ పెట్టారు. అనుకున్నట్టు కాకున్నా18 స్థానాల్లో గెలుపొందారు. అలా ఓపికగా ఉంటె పైకి లేచేవారేమో. ఓపిక లేక, కాంగ్రస్ తో కలిసిపోయి… ఆయన రాజకీయంగా చరిత్రలో కలిసిపోయారు. రాజకీయంగా చిరంజీవికి అంత చరిష్మా లేదు. అందుకే ఆయన చక్కగా సినిమాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే, రాజ్యసభ, కేంద్రమంత్రి లాంటి హోదాలు అనిభవించారు. ఇప్పుడు మళ్ళీ రాజ్యసభ, కేంద్రమంత్రి అంటే ఆయనకు అంత అవసరం ఉండకపోవచ్చు. వైసిపి అంటే ఒంటి కాలిపై లేస్తున్నతమ్ముడికి వ్యతిరేకంగా, ప్రత్యామ్నాయంగా రాజకీయంగా ఎదిగే ఆలోచన చేయకపోవచ్చు. మొత్తానికి చిరంజీవి మళ్ళీ ఆ తప్పు చేయరని సగటు అభిమాని అనుకుంటున్నారు.

శ్రీనివాస్ మానెం