‘ఎన్నికలు అంత పెద్ద విషయమా?’

మూడు రాష్ట్రాల ఎన్నికలలో పరాజాయంపై ప్రధాని మోదీ మొదటిసారి నోరు విప్పారు. అది అంత పెద్ద విషయం కాదని తేలిగ్గా తీసిపారేశారు. 2018 చాలా సత్ఫలితాలను ఇచ్చిన సంవత్సరమని ఆయన అన్నారు. దేశంలో అద్భుతమైన పరిమాణాలు చాలా ఉన్నాయనీ, వాటి ముందు ఎన్నికలు చాలా చిన్న విషయమని ఆయన పేర్కొన్నారు. నూతన సంవత్సరం మొదటి రోజున ఆయన ఎఎన్‌ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ మాజిక్ పని చేయడం లేదన్న మాటకు సమాధానం ఇస్తూ, మూడు రాష్ట్రాలలో పరాజయం పాలయినంత  మాత్రాన తమ ఆత్మవిశ్వాశం సడలిపోదని మోదీ అన్నారు.

పెద్ద నోట్ల రద్దు ఆకస్మిక నిర్ణయం ఏమీ కాదనీ, నల్లధనం పోగేసిన వారిని ఏడాది ముందే హెచ్చరించామనీ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నల్లధనం ప్రకటించి జరిమానా కట్టాలన్న తమ మాటను ఎవరూ పట్టించుకోలేదనీ, అందుకే పెద్ద నోట్లు రద్దు చేయాల్సి వచ్చిందనీ ఆయన పేర్కొన్నారు. ధనాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ఆ చర్య తప్పలేదని ఆయన అన్నారు.

జిఎస్‌టి లోటుపాట్లకు కాంగ్రెస్‌దే బాధ్యత అని ప్రధాని అన్నారు. ప్రణబ్ ముఖర్జీ హయాంలోనే జిఎస్‌టి విధివిధినాలు రూపొందాయనీ, ఆ చట్టం పార్లమెంటు ముందుకు వచ్చినపుడు కాంగ్రెస్ అక్కడే ఉందనీ పేర్కొంటూ, ఇప్పుడు లోటుపాట్లకు తనను బాధ్యుడిని చేయడం ఏమిటని ప్రశ్నించారు. జిఎస్‌టిలో ఇంకా కొన్ని మార్పులు అవసరమనీ, త్వరలోనే వాటిని ప్రవేశపెడతామనీ ఆయన చెప్పారు.

రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ వాగ్దానం రైతులను మభ్యపెట్టడం తప్ప మరోటి కాదని ఆయన అన్నారు. దేవీలాల్ హయాం నుంచీ రుణమాఫీ చేస్తున్నారని చెబుతూ, రైతు జీవితాలు ఎందుకు బాగుపడలేదని ఆయన ప్రశ్నించారు. రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పులు రావాలని ఆయన అన్నారు.

మైనాటిరిటీలు అభద్రతా భావానికి గురవుతున్నారన్న విషయం ప్రస్థావనకు వచ్చినపుడు, ఈ పరిస్థితి ఇప్పుడు కొత్తగా వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. ముస్లింలపై దేశంలో వివక్ష లేదని ఆయన అన్నారు. ఏ వర్గంపై అయినా కక్ష పూరితంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని ఆయన అన్నారు. వారిలో అభద్రత తొలగించడం అందరి బాధ్యత అని ఆయన అన్నారు. పరమత సహనం భారతీయతలో భాగమని ఆయన పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజకీయమ చేయడం సరి కాదని ఆయన పేర్కొన్నారు.

కెసిఆర్ పెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు మోదీ మద్దతు ఉందన్న చంద్రబాబు నాయుడి ఆరోపణను ప్రస్తావించినపుడు, అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నవిషయమే తనకు తెలియదని ఆయన అన్నారు. చంద్రబాబు తెలంగాణాపై ద్వేషంతో ఏదో చేయాలనుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆక్రోశంతోమాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇంతకీ ఈ కూటములు ఎందుకు ఏర్పడుతునాయని ఆయన ప్రశ్నించారు. మహాకూటమి అన్న మాటకే అర్ధం లేదని ఆయన అన్నారు. ఒక వ్యక్తి లక్ష్యంగా పార్టీలు ఏకం అవుతాయా అని ఆయన ప్రశ్నించారు. మహాకూటమి గురించి చర్చించాల్సిన పనే లేదని ఆయన అన్నారు. తెలంగాణాలో కూటమి గతి ఏమయిందని ఆయన ప్రశ్నించారు. ఈ తరహా కూటమి రాజకీయాలను ప్రజలు తిప్పి కొడతారని ఆయన అన్నారు. జీవితాతం కాంగ్రెస్‌ను వ్యతిరేకిచిన వారు ఇప్పుడు మోదీ వ్యతిరేకతతో అదే పార్టీతో చేతులు కలుపుతున్నారని, అలాంటి వారిని కాంగ్రెస్ మింగేస్తుందనీ ఆయన అన్నారు.