కోడికత్తి కేసులో కేంద్రం చూసిన జాతీయ భద్రత కోణం

కోడికత్తితో విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై దాడి చేసిన కేసును కేంద్రప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడం సహజంగానే రాష్ట్ర ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుకు అసంతృప్తి కలిగించింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వంపై కత్తి కట్టిన తర్వాత మోదీ అనుసరిస్తున్న కక్ష సాధింపు చర్యల్లో ఇది కూడా భాగమని ఆయన నమ్ముతున్నారు.
దీనిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నట్లు మీడియాలో వస్తున్నది. నిజానికి మోదీ ప్రభుత్వ నిర్ణయం చాలా హాస్యాస్పదమైనది. దానిని పట్టుకుని వైసిపి కాంగ్రెస్ కూడా ఎన్ఐఎ ముందు తేలుస్తాం అనడం మరింత హాస్యాస్పదంగా ఉంది. వైసిపి నాయకులు ఆరోపిస్తున్నట్లు జగన్‌పై జరిగింది హత్యాయత్నమే అనుకున్నా ఆ కేసును అప్పగించాల్సింది ఎన్‌ఐఎకు కాదు. జాతీయ భద్రతా పరమైన అంశాలు ఇమిడి ఉన్న నేరాల దర్యాప్రునకు ఉద్దేశించి మాత్రమే ఆ సంస్థను ఏర్పాటు చేశారు.
ఇప్పుడు జగన్‌పై జరిగిన దాడిని ఏరకమైన జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణిస్తున్నదీ కేంద్రం వివరించాలి. కానీ కేంద్రం ఆ పని చేయదు. చంద్రబాబు ప్రభుత్వం సిబిఐకి నోఎంట్రీ చెబుతూ నిర్ణయం తీసుకున్నది కాబట్టి కేసు సిబిఐకి అప్పగించడం కుదరదు. ఇక మిగిలిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎ కాబట్టి దానికి కేసు అప్పగించామని హైకోర్టుకు చెప్పి చేతులు దులుపుకున్నారు. అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఆలోచించలేదు.
కేంద్రం నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లాలా లేక పట్టించుకోకుండా వదిలిపెట్టాలా ఆని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కోర్టుకు వెళితే ప్రతిపక్షానికి అనవసరంగా ఆయుధం అందిచినట్లవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. పైగా హైకోర్టు నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందో తెలియదు అంటున్నారు. మౌనంగా కూర్చోవడమే మేలనీ, ప్రజలకు కూడా అర్ధమవుతుందనీ వారు చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది.