రవిప్రకాష్ వ్యూహం ఎక్కడ బెడిసింది!?

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

టివి9 మాజీ సిఇవో రవిప్రకాష్‌ వందల కోట్ల రూపాయల హవాలా కార్యకలాపాలు నడిపారన్న ఆరోపణలతో ఆయనపై ఇడి, సిబిఐ విచారణ కోరుతూ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించింది. సంచలనం సంగతి అలా ఉంచితే అకస్మాత్తుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ రంగంలోకి దిగడం కొన్ని ప్రశ్నలను లేపుతున్నది.

టివి9 యాజమాన్యం చేతులు మారి రవిప్రకాష్ బయటకు వెళ్లాల్సివచ్చిన  తర్వాత ఆయన దక్షిణ భారత భాషల్లో న్యూస్ ఛానళ్లు పెట్టబోతున్నారని వార్తలు వెలువడ్డాయి. బిజెపి తరపున ఈ ఛానళ్లకు పెట్టుబడులు సమకూరుతున్నాయనీ, రవిప్రకాష్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో టచ్‌లో ఉన్నారనీ వినబడింది. దానికి తగ్గట్లుగానే మొదట్లో  దూకుడుగా వ్యవహరించిన టివి9 కొత్త యాజమాన్యం తర్వాత రవిప్రకాష్‌పై ఉన్న కేసులను పట్టించుకోవడం మానేసింది. రవిప్రకాష్‌కు బిజెపి అండ ఉన్నందువల్ల వారు తగ్గారని అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా కొత్త కేసు తెరపైకి తెచ్చి రవిప్రకాష్‌ను జైలుకు పంపించారు.

ఆ తర్వాత రెండు రోజులకు వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అందులో రవిప్రకాష్‌‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఒక రాజ్యసభ సభ్యుడు ఇంత తీవ్రమైన ఆరోపణలతో ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖపై తదుపరి చర్య తప్పక ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమ్మతి లేకుండా ఆయన ఇలాంటి లేఖ ప్రధాన న్యాయమూర్తికి రాస్తారని అనుకోలేం. అలాగే టివి9 నూతన యాజమాన్యం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఎంత దగ్గరో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి రవిప్రకాష్‌ విషయంలో  రాజకీయ స్థాయిలో నిర్ణయం తీసుకోకుండానే ఆయనపై కొత్త అభియోగాలతో కేసు పెట్టిఉంటారని భావించలేం.

ఈ మొత్తం వ్యవహారం చూస్తే రవిప్రకాష్‌ను రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు  టార్గెట్ చేశాయని అనుకోవాల్సివస్తున్నది. మరి ఆయనకు బిజిపి అండ ఉన్నట్లయితే ఆ సాహసం చేయలేరు కదా? ఇక్కడే సమాధానం లేని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆయన వెనుక బిజెపి లేదా? ఈ కొత్త ఛానళ్లు తీసుకురాబోతున్నారన్న వార్తలు అన్నీ రవిప్రకాష్ సృష్టించిన గాలి మాత్రమేనా?

రెండు రాష్ట్రాలలోని అధికారపక్ష నేతలు తనను టార్గెట్ చేశారని రవిప్రకాష్‌కు తెలుసు. అలాంటప్పుడు తనను కాపాడగలిగేది ఒక్క బిజెపి మాత్రమేనని గ్రహించలేనంత అమాయకుడు కాదు రవిప్రకాష్. మరి ఆయన ఆ ప్రయత్నం చేయకుండా ఉండిఉంటాడా? టివి9 భారత్‌వర్ష్ ఛానల్ ప్రారంభం రవిప్రకాష్ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చేయిచారు. కేంద్రంలో సరైన చోట సరైన వ్యక్తులతో పరిచయం లేకపోతే అది సాధ్యం కాదు. మరి ఆ పరిచయాలు ఏమైపోయాయి? రవిప్రకాష్ వ్యూహం ఎక్కడ దెబ్బ తిన్నది? లేక అసలు వ్యూహమే లేదా?