పవన్‌కు క్రిస్మస్ గిఫ్ట్!

35 views

హైదరాబాద్‌, డిసెంబర్ 24 : జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌‌కు చిన్న అన్నయ్య నాగబాబుకు, ఆయన కుమారుడు వరుణ్‌తేజ్‌ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. వీరిద్దరూ కలిపి జనసేన పార్టీకి  కోటీ పాతిక లక్షల భారీ విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు.

“జనసేన పార్టీ మీద అభిమానంతోను, ఈ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న కాంక్షతోను నా చిన్న అన్నయ్య నాగబాబు, ఆయన కుమారుడు హీరో వరుణ్ తేజ్ పార్టీకి అందించిన విరాళానికి నేను పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ నాగబాబు గారు రూ. 25 లక్షలు, శ్రీ వరుణ్ తేజ్ కోటి రూపాయల వంతున పార్టీకి విరాళం అందజేశారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. శ్రీ నాగబాబు, శ్రీ వరుణ్ తేజ్ అందించిన విరాళాలు పార్టీకి క్రిస్మస్ కానుకగా నేను భావిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, తాను తిరిగి వచ్చిన తర్వాత వారిరువురిని నేరుగా కలిసి కృతజ్ఞతలు తెలుపుతానని అని పవన్‌ తన పోస్ట్‌లో తెలిపారు. పవన్ కళ్యాణ్ తల్లిగారు అంజనాదేవి ఈ మధ్యే జనసేనకు రూ.4లక్షలు విరాళం ఇవ్వగా ఇప్పుడు చిన్నన్నయ్య, ఆయన కుమారుడు విరాళం అందజేయడం విశేషం.

ఇదిలావుండగా పవన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ క్రిస్మస్‌ అందరి జీవితాల్లో సుఖసంతోషాల్ని నింపాలని కోరుకుంటున్నానన్నారు. తన ఇంటిలో అలంకరించిన క్రిస్మస్‌ ట్రీ ఫొటోను ఆయన షేర్‌ చేశారు. పవన్‌ ఇటీవల తన కుటుంబంతో కలిసి యూరప్‌ వెళ్లిన సంగతి తెలిసిందే.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పవన్ కళ్యాణ్ షేక్ చేసిన క్రిస్మస్ ట్రీ చిత్రం