మెరుపు దాడులు: మోదీ కేబినెట్ కీలక భేటీ


న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళాలు మెరుపుదాడులు చేశాయి. ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడంలో తాము విజయవంతమైనట్లు భద్రతా అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కేబినెట్ భేటీ అయ్యింది.

మంగళవారం ఉదయం ప్రధాని మోదీ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో తాజా పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. వైమానిక దాడులపై ప్రధానికి అజిద్ ధోవల్ వివరించారు. మంగళవారం తెల్లవారుజామున భారత వైమానిక దళాలు 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో నియంత్రణ రేఖను దాటి ఉగ్ర శిబిరాలపై 1000 కిలోల బాంబులు వేశాయి. దీంతో పదుల సంఖ్యలో ఉగ్ర శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ఈ దాడుల్లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ ఈ మెరుపుదాడులకు దిగింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో సరిహద్దు వెంబడి భద్రతా దళాలు భారీగా మోహరించాయి.

పాకిస్థాన్‌లోనూ అత్యవసర భేటీ

భారత వైమానిక దళాలు మెరుపుదాడులు జరిపిన నేపథ్యంలో పాకిస్థాన్ కూడా అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. ఇస్లామాబాద్‌లో అత్యవసర భేటీకి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ పిలుపునిచ్చారు. సరిహద్దులో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

చదవండి: భారత్ బాంబుల వర్షం: పాక్ ఉగ్ర శిబిరాలు ధ్వంసం