ట్వీట్లు మోతెక్కించిన మోదీ

  • అన్ని రంగాల ప్రముఖులకు ట్వీట్లు
  • పోలింగ్ పెరిగేలా చూడాలని వినతి
  • నటులు.. క్రీడాకారులు.. నాయకులు
  • ప్రతిపక్ష నేతలకూ మోదీ మార్కు ట్వీట్
  • తెలుగు ప్రముఖులనూ మరువని ప్రధాని

న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోలింగ్ శాతం పెంచాలని ప్రధాని నరేంద్రమోదీ కంకణం కట్టుకున్నారు. పొద్దున్నే లేచినప్పటి నుంచి వరుసపెట్టి ట్వీట్లు మోతెక్కించారు. తన బద్ధ శత్రువులైన రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, చంద్రబాబులకూ ఆయన ట్వీట్ చేశారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, పాత్రికేయులు.. ఇలా అన్ని రంగాల వారినీ పేరుపేరునా పలకరించారు. ఆధ్యాత్మిక గురువులు శ్రీశ్రీ రవిశంకర్ లాంటివాళ్లనూ వదల్లేదు. తెలుగు ప్రముఖులను కూడా ఆయన తన ట్వీట్లలో ట్యాగ్ చేశారు. ఈనాడు దినపత్రిక, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, తెలంగాణ సీఎం కేసీఆర్, సినీ హీరో నాగార్జున తదితరులను ట్యాగ్ చేశారు. ఏప్రిల్ – మే నెలల్లో జరిగే జాతీయ ఎన్నికల్లో ఎక్కువ మంది ప్రజలు ముందుకొచ్చి ఓట్లు వేసేలా వారిని ప్రోత్సహించాలని అడిగారు.
మన సమయం వచ్చింది…
‘‘చాలామంది యువత మిమ్మల్ని ఆరాధిస్తారు. వారికి ఒక్క మాట చెప్పాల్సిన సమయమిది. మన సమయం వచ్చేసింది. మంచి ఉత్సాహంతో దగ్గర్లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేయండి’’ అని ఆయన ట్వీట్ చేశారు. రణ్ వీర్ సింగ్, విక్కీ కౌశల్ తదితర నటులకు ట్వీట్ చేసేటపుడు ఇటీవలి కాలంలో ఫేమస్ అయిన గల్లీబోయ్, ఉరీ సినిమాల పేర్లూ ప్రస్తావించారు.
శత్రువులకే మొదటి ట్వీట్లు..
తనకు బద్ధ శత్రువులైన రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, శరద్ పవార్, మాయావతి, అఖిలేఖ్ యాదవ్, తేజస్వి యాదవ్, ఎంకే స్టాలిన్ లకు ముందుగా ట్వీట్ చేశారు. వారితో మొదలుపెట్టి దాదాపు 30 వరకు ట్వీట్లు ఒక్కరోజులోనే చేశారు. ‘‘రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పాల్గొనాలని ఓటర్లను ప్రోత్సహించండి. ఎక్కువ పోలింగ్ నమోదైతే మన ప్రజాస్వామ్యానికి మంచిది’’ అని చెప్పారు. వివిధ రాష్ట్రాల సీఎంలు కె. చంద్రశేఖర్ రావు, నవీన్ పట్నాయక్, కుమారస్వామిలతో పాటు ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ను కూడా ఆయన ట్యాగ్ చేయడం విశేషం.
అదే మంచి మార్గం
మిత్రులు నితీష్ కుమార్, రాంవిలాస్ పాశ్వాన్, పవన్ చామ్లింగ్ తదితరులను ఎక్కువ ఓటింగ్ పడేలా చూడాలని కోరారు. ప్రజల గొంతు వినపడేందుకు ఓటింగే మంచి మార్గం అని గాయని లతా మంగేష్కర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ లకు చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పలువురు ప్రస్తుత.. మాజీ క్రికెటర్లు, ఫోగట్ సోదరీమణులను కూడా ట్యాగ్ చేశారు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 23వ తేదీన వెలువడతాయి.