పంకజ పోస్ట్ వెనుక ఆంతర్యం ఏంటి ?

ముంబై: బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి పంజక ముండే పార్టీ మారనున్నారా? బీజేపీకి గుడ్ బై చెప్పి.. మహారాష్ట్రలోని సంకీర్ణ కూటమిలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా ? తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల అనంతరం- ఆమె బీజేపీకి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక,  భవిష్యత్‌ కార్యాచరణపై ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి పంజక ముండే ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ సర్వత్రా చర్చనీయాంశమైంది.

‘రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులను చూసిన తర్వాత భవిష్యత్తేమిటనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నాతో నేను చర్చించుకోవడానికి 8 నుంచి 10 రోజుల సమయం కావాలి’ అని తెలిపారు. తన తండ్రి, బీజేపీ దివంగత నేత గోపీనాథ్‌ ముండే 60వ జయంతి సందర్భంగా డిసెంబర్‌ 12లోపు తన రాజకీయ భవిష్యత్తుపై ఒక నిర్ణయాన్ని తీసుకుంటానని ఆమె వెల్లడించారు. పంజక ముందే చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

పంకజ ముండే బీజేపీకి గుడ్ బై చెప్పడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా- ట్విట్టర్ నుంచి బీజేపీ ఐడెంటిటీని తొలగించడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. శివసేన లేదా తనకు సమీప బంధువర్గం ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకునే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన సారథ్యంలోని కాంగ్రెస్-ఎన్సీపీల ‘మహావికాస్ ఆఘాడీ’ సంకీర్ణ కూటమి.. ఇక రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోందని సమాచారం. బీజేపీకి అధికారాన్ని దక్కకుండా చేసిన కూటమి.. ఇక రాజకీయంగా బలహీనపర్చే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నాయకులను ఆకర్షించే పనిలో పడిందని సమాచారం. ఇందులో భాగంగా- బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి, దివంగత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజా ముండేను కూటమిలో చేర్చుకునే దిశగా ఎత్తులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గోపీనాథ్ ముండే వారసురాలిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన పంకజా ముండే.. బీజేపీలో కీలక నాయకురాలిగా ఎదిగారు. ఇదివరకు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పని చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి చవి చూశారు. బీడ్ జిల్లాలోని పర్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గోపీనాథ్ ముండే.. తన సమీప ప్రత్యర్థి, ఎన్సీపీ అభ్యర్థి ధనంజయ ముండే చేతిలో ఓడిపోయారు. ధనంజయ ముండే పంకజ ముండేకు సమీప బంధువు. ధనుంజయ్‌ ముండేతో తీవ్ర రాజకీయ వైరం కొనసాగుతున్న నేపథ్యంలో పంకజ ముండే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.