ఆర్థిక సంక్షోభం.. ముదిరిన మాటల యుద్ధం!

న్యూఢిల్లీ: దేశంలోని ఆర్థిక సంక్షోభంపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్థిక సంక్షోభానికి యూపీఏ ప్రభుత్వాన్ని నిందించడం ప్రస్తుత మోదీ సర్కారుకు ఓ అలవాటై పోయిందని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారుఅమెరికా పర్యటనలో ఉన్న ఆమె.. మ‌న్మోహ‌న్ వ్యాఖ్య‌ల‌ను కొట్టిపారేశారు. బ్యాంకింగ్ రంగానికి ప‌ట్టిన మ‌లినాన్ని శుద్ధి చేస్తున్నామ‌ని ఆమె పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థలో లోటుపాట్లను సరిచేయడానికి ముందు అసలు సమస్యక మూలాలేంటో..దానికి పరిష్కారాలు ఏమున్నాయో చూడాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సూచించిన సంగతి తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వ అవన్నీ మానేసి విపక్షాలపై నిందలు మోపే ప్రయత్నాల్లోనే నిమగ్నమైందని విమర్శించారు. అయితే మ‌న్మోహ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను శుక్రవారం సీతారామ‌న్ ఖండించారు. త‌మ ప్ర‌భుత్వం అంద‌రి ఆవేద‌న‌ల‌ను వింటున్న‌ద‌ని, ప్ర‌భావానికి లోనైన రంగాల‌కు చేయూతనిస్తామ‌ని సీతారామ‌న్ తెలిపారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వల్లనే ప్రభుత్వ రంగ బ్యాంకులు దీన స్థితికి చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. యుపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణాల ఎగ్గొట్టిన వారి సంఖ్య భారీ స్థాయిలో ఉందని ఆమె విమర్శించారు. రాజన్ హయాంలో ఫోన్ కాల్ ద్వారానే కార్పోరేట్ కంపెనీలకు వేల కోట్లు రుణాలు ఇచ్చారని నిర్మలా ఆరోపించారు.

ఈ నేపథ్యంలో గురువారం మాజీ ప్రధాని మ‌న్మోహ‌న్ సింగ్ స్పందించారు. తమ పాలనలో జరిగిన తప్పుల నుంచి మోదీ సర్కారు గుణపాఠాలు నేర్చుకుంటే బాగుండేదని, ఇప్పుడున్న సమస్యలకు చక్కని పరిష్కారాలు దొరికేవి అని వ్యాఖ్యానించారు. నీరవ్ మోదీ, ఇతర రుణ ఎగవేతదారులు విదేశాలకు పారిపోయి ఉండేవారు కాదు. బ్యాంకుల పరిస్థితి మరింత దిగజారేది కాదు అని మ‌న్మోహ‌న్‌ చురకలంటించారు.