వర్షం పడిందంటే ఒక ప్రాంతంలో అంతా పడుతుంది. అంతే తప్ప ధారగా ఒక్కచోటే పడటం అసాధ్యం. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో నెల రోజులుగా తిరుగుతున్న ఒక వీడియోలో మాత్రం ఇలా పడుతోందని చెబుతున్నారు. సుంకర దీపక్ రెడ్డి అనే యూజర్ ఏప్రిల్ 24న దీన్ని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. దానికి..
“నిన్న దక్షిణాఫ్రికాలోని టోగో దగ్గర ఆకాశం నుంచి భూమ్మీదకు ఒకే ప్రదేశంలో బిందెలో నుంచి నీళ్లు పోసినట్టు ధార పడింది. ఆ జలపాతాన్ని భూదేవి నోరు తెరచి (నీళ్లు పక్కకు వెళ్లకుండా) తాగింది. ఆ అద్భుత దృశ్యాన్ని మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. పరమాత్ముడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?’’ అని కేప్షన పెట్టారు.
https://www.facebook.com/100008443952543/videos/2116827918608653/
నేల మీది నుంచి పైకి
మామూలుగా వీడియో చూస్తే అతడు చెప్పినది నిజమే అనుకుంటారు. కానీ కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ నీళ్లు వచ్చేది ఆకాశం లోంచి కిందకు కాదు.. భూమిలోంచి పైకి అని అర్థమవుతుంది. వీడియోలో చాలాచోట్ల అది నిజంగానే ఆకాశం నుంచి పడుతున్నట్లు అనిపిస్తుంది. ఎక్కువ ఎత్తు ఎక్కడుందన్న దానికి మధ్యలో చెట్లు అడ్డు వస్తాయి. కానీ, వీడియోలో కొన్నిచోట్ల చూస్తే.. ఆకాశంలో మేఘాలకు, నీటి ఎత్తుకు బాగా తేడా కనిపిస్తుంది. అలాగే భూమి లోంచి నీళ్లు పైకి ఉబుకుతున్న విషయం కూడా అర్థమవుతుంది.
ఈ వీడియో గుట్టును అమెరికాకు చెందిన ఫాక్ట్ చెకింగ్ సైట్ ‘స్నూప్స్’ 2016లోనే రట్టుచేసింది. ప్రస్తుతం టోంగో పేరుతో అది ప్రచారం అవుతుండగా, అప్పట్లో అది ఇండోనేసియా, చైనా, వియత్నాంల పేరుతో చక్కర్లు కొట్టింది. యూట్యూబ్ లో కూడా అదే వీడియో వేరే పేరుతో ఉంది. అందులో బావి తవ్వకం అన్నట్లుగా వివరణ ఉంది.
(ఆల్ట్ న్యూస్ సౌజన్యంతో)