33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
Right Side Videos టాప్ స్టోరీస్

వర్మ సినిమా ఇలా కాక ఎలా ఉంటుంది!

Share

ఎన్‌టిఆర్ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన దశ, లక్ష్మీపార్వతిని ఆయన దగ్గరకు తీయడంతో మొదలయింది. దగ్గర దగ్గర నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలిగి అరవయ్యో పడిలో రాజకీయాల్లో కూడా చరిత్ర సృష్టించిన ఆ మహానటుడి జీవితంలో అత్యంత నాటకీయమైన ఘట్టం కూడా అప్పుడే మొదలయింది.

తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే కాంగ్రెస్‌ను మట్టి కరిపించి పార్టీకి అధికారాన్ని సంపాదించి పెట్టిన ఎన్‌టిఆర్, ఆ ప్రస్థానంలో ఎందరో అనామకులకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన ఎన్‌టిఆర్ ఉద్ధానపతనాల్లో అత్యంత దారుణమైన పతనానికి నాందీ ప్రస్థావన మొదలయింది అప్పుడే.

సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు నాటకీయత అంటే చాలా ఇష్టం. తన ప్రతి సినిమాకూ ఏదో ఒక సంచలనం సృష్టించి దానిని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. గెలుపోటముల్ని పెద్దగా లెక్క చేసే మనిషి కాదు. షాక్ వాల్యూతో కూడిన నాటకీయతతో నిత్యం వార్తల్లో ఉండడం అతనికి ఇష్టం.

అలాంటి వాడు ఎన్‌టిఆర్ జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నాడంటే ఎక్కడ ఏ ఘట్టానికి ప్రాధాన్యత ఇస్తాడో తెలుసుకునేందుకు పెద్దగా ఊహాశక్తి అవసరం లేదు. లక్ష్మీస్ ఎన్‌టిఆర్ అన్న సినిమా పేరులోనే వర్మ తన ఆంతర్యాన్ని బయటపెట్టారు.

నిన్న విడుదల అయిన ట్రయిలర్‌ చూస్తే ఇంకా ఎవరికన్నా అనుమానాలు ఉంటే అవి పటాపంచలవుతాయి.

ప్రభుత్వంలో, పార్టీలో లక్ష్మీపార్వతి జోక్యాన్ని నిరసిస్తూ ఎన్‌టిఆర్‌పై తిరుగుబాటు చేసి ఆయనను గద్దె దించిన చిన్నల్లుడు చంద్రబాబు నాయుడిని ఈ సినిమా విలన్‌గానే చూపిస్తుందని ట్రయిలర్‌ ద్వారా సుస్పష్టం అయింది. ఎన్‌టిఆర్‌ కుటుంబ సభ్యుల పాత్రను కూడా వర్మ ఉన్నది ఉన్నట్లుగానే (అవసరమైతే ఇంకాస్త నాటకీయత జోడించి) చూపిస్తారని అర్ధమయింది.

ఎన్‌టిఆర్‌ జీవితంలో అత్యంత వివాదాస్పద ఘట్టం వైస్‌రాయ్ హోటల్ దగ్గర ఆయనపై చెప్పులు పడడం. తాను ఒంటి చేత్తో గెలిపించిన పార్టీ శాసనసభ్యులు, నిన్నటి వరకూ తన అడుగులకు మడుగులొత్తిన వారు, తనపైనే చెప్పులు విసరడం ఆయన గుండెకు చేసిన గాయం మామూలు గాయం కాదు, అది ఎన్నటికీ మానని గాయం.

దీని కంతటికీ కారణమైన చంద్రబాబు నాయుడిని ఎన్‌టిఆర్ ఎంత తీవ్రంగా ద్వేషించారో ఆయన ఆ తర్వాత విడుదల చేసిన వీడియో చూస్తే తెలుస్తుంది. తన సినిమాలో డ్రామా పండించేందుకు వర్మ ఈ ఘట్టాన్ని ఎంతగా వాడుకోవాలో అంతగా వాడుకున్నారని కూడా ట్రయిలర్ చూస్తేనే అర్ధమైపోతున్నది.

మామూలుగా అయితే దీని గురించి అంతగా చర్చ అనవసరం. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అది కూడా రాష్ట్ర విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో ఒక చరిత్రాత్మక దశలో ఆయన అధికారంలోకి వచ్చారు. ఎన్‌టిఆర్‌ను గద్దె దించిన నాటికీ ఇప్పటికీ ఆయనలో సంభవించిన పరిణామం చాలా గణించదగ్గది. ఈ మధ్యలో రాజకీయంగా ఆయన చాలా ఎదిగారు. చాలా పరిణితి సాధించారు. జాతీయ రాజకీయాల్లో గణనీయమైన పాత్ర పోషించారు, పోషిస్తున్నారు.

రేపు ఆయన నవ్యాంధ్ర అభివృద్ధికి తాను తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్న స్లోగన్‌తో ఎన్నికలకు వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గానీ, అంతకంటే ముఖ్యంగా ఫెడరల్ స్ఫూర్తితో కూడిన ప్రజాస్వామ్య పరిరక్షణకు గానీ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించక తప్పదన్న వాదనను తెరపైకి తెచ్చి ప్రతిపక్షాల ఐక్యతకు సూత్రధారిగా వ్యవహరిస్తున్నారు.

ఈ దశలో చంద్రబాబు రాజకీయ జీవితంలో ఆయనే మరచిపోవడానికి ఇష్టపడే ఒకానొక ఘట్టానికి రామ్‌గోపాల్ వర్మ మళ్లీ ప్రాణం పోస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా తీసిన యాత్ర సినిమా తమకు రానున్న ఎన్నికలలో రాజకీయంగా ఉపయోగపడుతుందని ఇప్పటికే సంతోషిస్తున్న వైసిపి శ్రేణులు లక్ష్మీస్ ఎన్‌టిఆర్‌ చూసి మరింత సంబరపడటం ఖాయం.

రామ్‌గోపాల్ వర్మ తీస్తున్న ఎన్‌టిఆర్ బయోపిక్ ఎలా ఉంటుందో అందరికీ ముందే తెలుసు. మొదట్లోనే ఆయన పోస్టర్‌తో కాస్త రుచి చూపించారు. ఇంకా ఏమన్నా గుట్టంటూ మిగిలితే ఇప్పుడు ట్రయిలర్‌తో ఆ కాస్తా విప్పేశారు. ముందే అన్నట్లు ఇది ఊహించని పరిణామం ఏమీ కాదు. తెలుగుదేశం పార్టీ వర్గాలు దీనికి ఎలా స్పందిస్తాయన్నది మాత్రం వేచి చూడాలి.

కింద క్లిక్ చేసి ట్రయిలర్ చూడండి:


Share

Related posts

వారిలో ఒకడు సొంత కుమార్తెనే చెరిచాడు!

Siva Prasad

పాత కార్టూన్ తీసి.. దాన్ని మార్చి..!

Kamesh

తెలంగాణలో మద్యం షాపులకు పెరిగిన పోటీ

Siva Prasad

Leave a Comment