సిఎం గారూ, ఇంద ఆరు రూపాయలు

 మహారాష్ట్రలో ఓ ఉల్లి రైతు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆరు రూపాయలు పంపించాడు. అంతకు ముందు మరో రైతు ప్రధానమంత్రికి 1064 రూపాయలు పంపించాడు. ఈ రైతులకు డబ్బు ఎక్కువయిందనుకుంటున్నారా? కాదు. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో తమ ఆగ్రహాన్ని, నిరసనను ఆ విధంగా తెలిపారు.

మహారాష్ట్రలో ఈ సీజన్‌లో ఉల్లిపాయలు బంపర్‌గా పండాయి. అదే రైతులకు శాపంగా  మారింది. ధరలు పతనం అయ్యాయి. ధరలను స్థిరీకరించడం ఫడ్నవీస్ ప్రభుత్వానికి చేతకాలేదు. దానితో పండించిన పంట అమ్ముకుంటున్న ప్రతిసారీ రైతుల కళ్ల నీళ్లు పెడుతున్నారు.

అహ్మదనగర్ జిల్లాకు చెందిన రైతు శ్రేయాస్ అభాలే మార్కెట్‌కు 2657 కెజీల ఉల్లిపాయలు తెచ్చాడు. కెజికి రూపాయి ధర పలికింది. రవాణా, కూలీ ఖర్చులు పోను ఆరు రూపాయలు మిగిలాయి. ఏం చేయ్యాలో తెలియక ఆ ఆరు రూపాయలు ముఖ్యమంత్రికి మనీయార్డర్ చేశాడు. ఉత్పాతాల సహాయ నిధికి జమ చేయమంటూ ప్రధానమంత్రికి 1064 రూపాయలు పంపించిన నాసిక్ రైతు సంజయ్ సాథే కథ కూడా ఇదే. 750 కెజిల పంట అమ్మితే 1064 రూపాయలు చేతిలో పడ్డాయి. మొత్తం డబ్బు మోదీకి పంపించాడు.

ఉల్లి పంటకు గిట్టుబాటు దర లేక నాసిక్ జిల్లాలో రెండు రోజుల క్రితం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏమీ పాలుపోని రైతులు తమ ఆగ్రహాన్ని రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు. నేవాసా తాలూకాలో ఒక రైతు 20 క్వింటాళ్ల ఉల్లిపాయలు ఉచితంగా పంచిపెట్టాడు. పంచే దగ్గర ఒక ఫ్లెక్సీ తగిలించాడు. ఉల్లి ధర మరీ తక్కువగా ఉంచినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు అంటూ దానిపై రాసి ఉంది.