పీవోకేలో దాడులేమీ జరగలేదట!

ఇస్లామాబాద్: పీవోకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేశామన్న భారత ప్రకటనను పాకిస్థాన్‌ తోసిపుచ్చింది. పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో మూడు ఉగ్ర స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు భార‌త ఆర్మీ చేసిన ప్ర‌క‌ట‌న‌ను పాకిస్థాన్ మిలిట‌రీ కొట్టిపారేసింది. భార‌త ఆర్మీ చీఫ్ చేసిన ప్ర‌క‌ట‌న నిరుత్సాహాప‌రుస్తున్న‌ద‌ని పాక్ మిలిట‌రీ ప్ర‌తినిధి జ‌న‌ర‌ల్ అసిఫ్ గ‌ఫూర్ తెలిపారు. ఒక‌వేళ ఉగ్ర స్థావ‌రాలు ధ్వంసం అయ్యింది నిజ‌మే అయితే, ఆ ప్రాంతాల‌కు విదేశీ మీడియోను లేదా దౌత్య‌వేత్త‌ల‌ను తీసుకువెళ్లి చూపించాల‌న్నారు. జ‌మ్మూక‌శ్మీర్‌లోని తంగ్‌దార్‌ సెక్టార్ వ‌ద్ద భార‌త ఆర్మీ చేసిన ప్ర‌తీకార దాడుల్లో ప‌ది మంది వ‌ర‌కు పాక్ జ‌వాన్లు హ‌త‌మైన‌ట్లు ఆర్మీ చీఫ్ బిపిన్ రావ‌త్ ఆదివారం ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పాక్ మిలిట‌రీ ప్ర‌తినిధి అసిఫ్ గ‌ఫూర్‌.. త‌న ట్వీట్‌లో భార‌త్ వాద‌న‌ల‌ను తోసిపుచ్చారు. పాక్‌లో ఉన్న భార‌త ఎంబ‌సీ అధికారులు.. క్యాంపు ప్రాంతాల‌ను విజిట్ చేయ‌వ‌చ్చు అని అన్నారు. స్వ‌దేశీ అవ‌స‌రాల దృష్టానే రావ‌త్ ఆ కామెంట్ చేశార‌ని, ఇది ప్రొఫెష‌న‌ల్ మిలిట‌రీ నైతిక‌త‌కు వ్య‌తిరేమ‌ని గ‌ఫూర్ పేర్కొన్నారు.

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలతోపాటు ఆ దేశ ఆర్మీ పోస్ట్ లపై ఆదివారం భారత ఆర్మీ దాడులు చేసిన విషయం తెలిసిందే. కుప్వారాలోని తాంగ్ధర్‌ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న నీలం లోయలోని కనీసం నాలుగు ఉగ్రశిబిరాలతో పాటు పాక్‌ సైన్యానికి చెందిన పలు మిలిటరీ పోస్టులపై భారత బలగాలు శతఘ్నులతో విరుచుకుపడ్డాయి. శతఘ్నులతో చేసిన ఈ దాడిలో కొందరు ఉగ్రవాదులతో పాటు ఐదుగురు పాక్ ఆర్మీ సిబ్బంది కూడా హతమయ్యారు. సరిహద్దుల వద్ద పాక్ ఆర్మీ కాల్పులు, పీవోకేలో మరోసారి శిబిరాలు ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యల కారణంగా భారత్ ఈ దాడులు చేపట్టింది.

పీవోకేలోని నాలుగు ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేపట్టిందన్న వార్తలను పాకిస్థాన్‌ ఖండించింది. పీవోకేలో ఉగ్రవాద శిబిరాలున్నట్టు భారత్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నదని, అవసరమైతే పీ5 దేశాలకు(ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు)చెందిన దౌత్యవేత్తలను అక్కడ పర్యటించి నిజానిజాలు వెలికితీసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి మహమ్మద్‌ ఫైజల్‌ పేర్కొన్నారు.