వియన్నా ఒప్పందం అతిక్రమించిన పాక్

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ చెరలో ఉంటోన్న భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో వియన్నా ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) స్పష్టం చేసింది. జాదవ్‌ కేసులో పాకిస్తాన్‌ వ్యవహరించిన తీరును ఎండగట్టింది. తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పాక్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇంట‌ర్నేష‌న్ కోర్ట్ ఆఫ్ జ‌స్టిస్ ప్రెసిడెంట్ జ‌డ్జి అబ్దుల్‌కావి యూసుఫ్ త‌న తీర్పులో ఈ విష‌యాన్ని పేర్కొన్నారు. వియ‌న్నా క‌న్వెన్ష‌న్‌లోని ఆర్టిక‌ల్ 36 నిబంధ‌న‌ల‌ను పాక్ అతిక్ర‌మించింద‌న్నారు. యూఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో జ‌డ్జి అబ్దుల్‌కావి .. జాద‌వ్ కేసులో నివేదికను సమర్పించారు.  జూలై 17వ తేదీన జ‌రిగిన విచార‌ణ‌కు సంబంధించిన తీర్పు ఆ రిపోర్ట్‌లో ఉంది. పాకిస్థాన్ మిలిట‌రీ కోర్టు జాద‌వ్‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించింది. ఆ కేసులో పాక్ త‌న తీర్పును స‌మీక్షించుకోవాల‌ని అంత‌ర్జాతీయ కోర్టు కోరింది. కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌కు విధించిన శిక్ష విష‌యంలో సంపూర్ణ స్థాయిలో స‌మీక్ష జ‌ర‌గాల‌ని యూసుఫ్ నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయ‌ప‌డింది. ఐసీజే ప్రకటనతో భూషణ్ జాదవ్ కేసులో పాక్ పై భారత్ విజయం సాధించింది.

భారత గూఢచార సంస్థ ‘రా’ కోసం గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ జాదవ్‌ను బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో  2016 మార్చి 3న పాకిస్థాన్ అరెస్ట్ చేసిన విషయం విదితమే. అనంతరం 2017లో పాక్ మిలిటరీ న్యాయస్థానం ఆయనకు మరణశిక్ష విధించింది. దీనిపై అభ్యంతరాలు తెలిపిన భారత్.. నెదర్లాండ్స్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేయడంతో దీనిపై విచారణ జరిగింది. ఈ కేసులో పాకిస్థాన్ పునఃసమీక్ష చేసే వరకు కుల్ భూషణ్ మరణశిక్ష అమలుపై అప్పట్లో ఐసీజే స్టే విధించింది. భారత్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. పాక్ దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది.