పవన్‌కు మాయావతి మద్దతు!

లక్నోలో మీడియాతో మాట్లాడుతున్న బిఎస్‌పి అధినేత్రి మాయావతి: photo courtesy: ANI

లక్నో: మొదటి నుంచీ దళితులకు సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తూ వారి మనసు చూరగొనేందుకు ప్రయత్నిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దళితనేత మాయావతి మద్దతు సంపాదించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బిఎస్‌పితో కలిసి పని చేసేందుకు తమ రెండు పార్టీల మధ్యా అవగాహన కుదిరిందని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో వెళ్లిన పవన్‌ బిఎస్‌పి అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. ఎన్నికల్లో పొత్తుపై ఆమెతో చర్చించారు. మాయావతితో పవన్ భేటీ కావడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఒకసారి లక్నోలోనే ఆమెతో కలిసి రాజకీయాలపై చర్చించారు.

శుక్రవారం మయావతితో కలిసి పవన్‌ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రలలో జనసేన, బిఎస్‌పి మధ్య ఎన్నికల అవగాహన కుదిరిందని పవన్ పేర్కొన్నారు. మాయావతి మాట్లాడుతూ, అంధ్రప్రదేశ్‌లో తమ ఐక్య సంఘటన అధికారంలోకి వస్తుందనీ, లోక్‌సభ సీట్లు కూడా గణనీయంగా గెల్చుకుంటుందనీ అన్నారు. తెలుగుదేశం, బిజెపి, కాంగ్రెస్ పార్టీల కన్నా తాము ముందుంటామని ఆమె పేర్కొన్నారు.

మాయావతిని ప్రధాని మంత్రిగా చూడాలని ఉందని పవన్ వ్యాఖ్యానించారు. తెలంగాణా కోసం అక్కడి ప్రజలు పోరాడినపుడు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామన్నారనీ, చివరికి రాష్ట్రం వచ్చింది కానీ, దళితుడు ముఖ్యమంత్రి కాలేకపోయాడని ఆయన అన్నారు. మాయావతి ఏకంగా ప్రధానమంత్రి అవుతారనీ, తామంతా అందుకు సహకరిస్తామనీ పవన్ అన్నారు.

దేశానికి మాయావతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమని పవన్‌ అన్నారు. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు సామాజిక న్యాయం అందరికీ అందాల్సిన అవసరం ఉందన్నారు. మాయావతి అడుగు జాడల్లో నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని పవన్ అన్నారు.