ప్రజాదీవెనలు ఉంటే సింహపురివాసే సీఎం

నెల్లూరు, మార్చి 4: ప్రజాదీవెనలు ఉంటే సింహపురివాసే ముఖ్యమంత్రి అవుతాడని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలకు పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల పేర్లు పెడతామని పవన్ కళ్యాణ్ అన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పర్యటనలో భాగంగా సోమవారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. తొలుత కార్యకర్తలతో సమావేశం, అనంతరం విద్యార్థులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. తదుపరి ఆత్మకూరు బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం, విఆర్‌సి సెంటర్ వరకూ రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు.

కుటుంబ రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల వెంట ఉండే వ్యక్తులను రాజకీయాల్లోకి తీసుకుని వస్తామని పవన్ అన్నారు. రాజకీయాల్లోకి కొత్తరక్తం రావాలన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు పవన్ తెలిపారు. తనకు సంబంధం లేకపోయినా నెల్లూరు నుండి వెళ్లి తెలంగాణ సాయుథ పోరాటంలో పుచ్చలపల్లి పాల్గొన్నారని కొనియాడారు.

నెల్లూరు జిల్లాలో లక్షలాది మంది యువత నిరుద్యోగ సమస్య వేధిస్తుందని అన్నారు. కృష్ణపట్నం పోర్టు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు, వారికి నష్టపరిహారం అందేలా జనసేన పోరాడుతుందని పవన్ తెలిపారు.

జనసేన అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను వివరించారు.

ప్రస్తుతం సమాజంలో చదివిన చదువుకి సరైన ఉద్యోగం లభించడం లేదని, యువత కోపాన్ని తాము అర్థం చేసుకోగలనని పవన్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర అని పవన్ అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు నాదెండ్ల మనోహర్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.