బాగ్దాదీ ఆపరేషన్ వీడియోను విడుదల చేసిన అమెరికా!

వాషింగ్టన్: ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీని అంతమొందించిన ఆపరేషన్ కి సంబంధించిన వీడియోలు, ఫొటోలను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ విడుదల చేసింది. ఈ వీడియోలో అమెరికా సైనికులు బగ్దాదీ ఇంటిని చుట్టుముడుతుండడం, ఓ జాగిలం పరుగులు పెట్టడం, ప్రత్యేక బలగాలు హెలికాప్టర్ నుంచి కిందికి దిగుతున్న సమయంలో ఉగ్రవాదులు వారిపైకి కాల్పులు జరపడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే, దాడికి ముందు, ఆ తర్వాత బగ్దాదీ ఇంటిని కూడా చూపించారు.

బగ్దాదీ ఇంటిని చుట్టుముట్టిన తర్వాత అతడి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసినట్టు పెంటగాన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంట్రల్ కమాండ్ కమాండర్ కెన్నెత్ మెకంజీ తెలిపారు. బగ్దాదీ తనకు తాను పేల్చుకున్నప్పుడు అతడితో పాటు చనిపోయింది ముగ్గురు పిల్లలు కాదని, ఇద్దరేనని స్పష్టం చేశారు. చనిపోయిన ఇద్దరూ 12 ఏళ్ల లోపు వారేనన్నారు. బాగ్దాదీ తన ఇద్దరు పిల్లలతో భూగర్భ సొరంగంలో దాక్కొని కాల్పులకు తెగబడ్డాడని తెలిపారు. అనంతరం అదే టన్నెల్లో ఉండి ఆత్మాహుతి చేసుకున్నాడని తెలిపారు. అదే కాంపౌండ్‌లో ఉన్న మరో నలుగురు మహిళలు, ఓ పురుషుడు హతమైనట్టు పేర్కొన్నారు. హెలికాప్టర్లపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో వైమానిక దాడి జరపక తప్పలేదని పేర్కొన్నారు.

బగ్దాదీ ఇంటి నుంచి ఐసిస్ కార్యకలాపాలకు సంబంధించి పలు ఎలక్ట్రానిక్, డాక్యుమెంట్ రూపంలో ఉన్న ఆధారాలను సేకరించినట్టు మెకంజీ వివరించారు. 2004లో ఇరాక్ జైలులో బగ్దాదీని బంధించినప్పుడు అతడి నుంచి డీఎన్ఏ సేకరించామని, దాని ఆధారంగానే తాజాగా బగ్దాదీ మృతిని ధ్రువీకరించినట్టు తెలిపారు. బగ్దాదీని హతమార్చిన అనంతరం 24 గంటల్లోనే అతడి అవశేషాలను సముద్రంలో కలిపేసి అంతర్జాతీయ నిబంధనలు పాటించినట్టు మెకంజీ వెల్లడించారు. ఇక, బగ్దాదీని తరిమిన జాగిలం ఇప్పటి వరకు 50 దాడుల్లో పాల్గొందని, తాజా దాడిలో గాయపడినా వెంటనే కోలుకుని విధుల్లో చేరిందని తెలిపారు.  బాగ్దాదీ హతమైనంత మాత్రాన ఐసిస్ కథ ముగిసినట్లు భావించడం లేదన్నారు.  ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన దాని మూలాలతో ఇంకా ముప్పు పొంచి ఉందని మెకంజీ చెప్పారు.

అమెరికా భద్రతా దళాలు జరిపిన దాడుల్లో ఐసిస్ ఉగ్రసంస్థ అధినేత అబూ బకర్‌ హతమైన విషయం తెలిసిందే. భయానకమైన టెరరిస్టు కార్యకలాపాలతో కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఐఎస్ఐఎస్ నేత అబూ బకర్ ఆల్ బాగ్దాదీ మరణించాడని అక్టోబర్ 27న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రత్యేక దళాలు సిరియాలోని ఒక ప్రాంతంలో బాగ్దాదీ తలదాచుకున్న కాంపౌండ్‌పై దాడి చేశాయి. ఓవైపు అమెరికా దళాలు తమ తుపాకులు ఎక్కుపెట్టి వెంటాడుతుండగా..మరోవైపు ఆ దళాలతో బాటు ఆమెరికా సైన్యానికి చెందిన ఓ జాగిలం కూడా అతడి వెంటాడి.. వేటాడింది. రెండు గంటల పాటు జరిగిన ఈ సైనికచర్యలో బాగ్దాదీ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కాంపౌండ్‌లో ఉన్న భూగర్భ సొరంగంలో తలదాచుకున్న బాగ్దాదీ.. అమెరికా సైనిక జవాన్లకు పట్టుబడకుండా ఉండేందుకు ఆత్యహత్య చేసుకున్నాడు. తాను ధరించిన పేలుడు పదార్ధాలతో తయారు చేసిన జాకెట్‌ను పేల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతి చెందింది బాగ్దాదీయేనని తర్వాత డిఎన్‌ఎ పరీక్ష ద్వారా నిర్ధారించుకున్నారు. బాగ్దాదీతో పాటు అక్కడ ఉన్న అతని పిల్లలు కూడా ఈ పేలుడులో చనిపోయారు. ఈ దాడి మొత్తాన్నీ తాను వైట్‌హౌస్‌నుంచి ప్రత్యక్షప్రసారం ద్వారా చూశానని ట్రంప్ చెప్పారు. బాగ్దాదీ కుక్కచావు చచ్చాడు ఇని ఆయన అన్నారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో అమెరికా వైపున ప్రాణనష్టం లేదని ఆయన పేర్కొన్నారు.