‘కశ్మీరీలకు పాక్‌ లో ఉగ్ర శిక్షణ’

ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌లో భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి కశ్మీరీలు పాకిస్థాన్‌లో శిక్షణ పొందారని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తెలిపారు. ఒసామా బిన్ లాడెన్, జలాలుద్దీన్ హక్కానీలు పాక్ హీరోలేనని ముషారఫ్ వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో ముషారఫ్ చేసిన వ్యాఖ్యల క్లిప్ లను పాక్ రాజకీయవేత్త ఫర్హతుల్లా బాబర్ బుధవారం ట్విట్టర్ లో షేర్ చేశారు.

‘పాకిస్థాన్ కు వచ్చిన కశ్మీరీలకు ఇక్కడ హీరో స్థాయిలో స్వాగత సత్కారాలు అభించాయి. మేము వాళ్లకు శిక్షణ ఇవ్వడమే కాకుండా పూర్తి సహకారాన్ని అందించాం. వాళ్లను మేము భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడే ముజాహిదీన్ లుగా గౌరవించాం. ఆ సమయంలోనే లష్కరే తాయిబా వంటి ఉగ్ర సంస్థలు ఎదిగాయి. వాళ్లంతా మా హీరోలు’ అంటూ ఆ క్లిప్ లో ముషారఫ్ వ్యాఖ్యానించారు.

‘1979 వ సంవత్సరంలో పాకిస్థాన్ ప్రయోజనం కోసం ఆఫ్ఘనిస్థాన్ దేశంలో మత ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాం. ప్రపంచం నలుమూలల నుంచి ముజాహిదీన్‌లను తీసుకువచ్చి వారికి మేం శిక్షణ ఇచ్చి, ఆయుధాలు కూడా సరఫరా చేశాం. తాలిబన్లకు కూడా శిక్షణ ఇచ్చాం. హక్కానీ, ఒసామా బిన్‌ లాడెన్ లు మా హీరోలు. అయితే, ఈ అంశాన్ని ప్రపంచమంతా వేరే కోణంలో చూడటం ప్రారంభించింది. దీంతో మా హీరోలంతా విలన్లుగా మారిపోయారు’ అని ముషారఫ్ పేర్కొన్నారు.