ఆర్‌టిసి సమ్మెపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్:  ఆర్‌టిసి కార్మికుల సమ్మెపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ఓయూ విద్యార్థి సంఘం నేత సురేంద్ర సింగ్‌ దాఖలు చేశారు. అయితే ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసంలో పిటిషన్‌పై విచారణ ప్రారంభం అయ్యింది. ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందనీ, ఆ హామీని విస్మరించడంతో కార్మికులు సమ్మె చేస్తున్నారనీ విద్యార్థి ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలనీ, సమ్మె వల్ల లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారనీ సురేంద్రసింగ్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు.  తమ డిమాండ్‌ల పరిష్కారం కోసం కార్మికులు చేస్తున్న సమ్మె రెండో రోజుకు చేరింది. మరో పక్క ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రవాణా, పోలీస్, ఆర్‌టిసి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమ్మెపై కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయంలో కెసిఆర్ ఉన్నారు. ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దిక్కారంగా వ్యవహరిస్తున్న కార్మికులను డిస్మిస్ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ప్రైవేటు బస్సు సర్వీస్‌లకు రూట్ పర్మిట్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్‌లను పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాలు పట్టుదలతో ఉండగా కార్మికుల సమ్మెను ఉపేక్షించేది లేదని ప్రభుత్వం కూడా కఠినమైన నిర్ణయాలకు పూనుకుంటోంది.