అర్ధరాత్రి ప్రమాణస్వీకారం

పనాజీ: గోవా కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు ప్రమోద్ సావంత్ అర్ధరాత్రి 2 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. మనోహర్ పారికర్ క్లోమ కేన్సర్ తో బాధపడుతూ మరణించడంతో గోవాలో కుర్చీలాట మొదలైంది. తాము అధికారం చేపడతామని కాంగ్రెస్ అప్పటికే చెప్పడంతో నష్ట నివారణ కోసం కమలనాథులు చకచకా ఎత్తులు వేశారు. ఆదివారం సాయంత్రం మనోహర్ పారికర్ మరణించగా, కొద్దిసేపటికే రాజకీయ పరిణామాలు మొదలయ్యాయి. తమకు అనుకూలంగా ఉన్న పార్టీలతో రాత్రివరకు చర్చించిన తర్వాత అమిత్ షా రంగ ప్రవేశం చేశారు. దాంతో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. చిన్న రాష్ట్రమైన గోవా ప్రభుత్వంలో ఈసారి ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉండబోతున్నారు. సమస్య పరిష్కారానికి అంతకంటే మార్గం దొరకలేదు. ఈ ఇద్దరిలో ఒకరు ఎంజీపీ నుంచి, మరొకరు గోవా ఫార్వార్డ్ పార్టీ నుంచి ఉంటారు. ఈ ఒప్పందం అర్ధరాత్రి కుదరడంతో, అప్పటికప్పుడు గవర్నరుకు కబురు పంపి రాత్రి 2 గంటలకు ముఖ్యమంత్రి, ఆయన 12 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వారిలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు.

మనోహర్ పారికర్ చేసినంతగా తాను చేయలేకపోవచ్చని, కానీ తప్పకుండా చేయగలిగినంత చేస్తానని ప్రమాణస్వీకారం అనంతరం సావంత్ అన్నారు. కొత్త ఉప ముఖ్యమంత్రులుగా ఎంజీపీకి చెందిన సుదిన్ ధావలికర్, గోవా ఫార్వార్డ్ పార్టీకి చెందిన విజయ్ సర్దేశాయ్ బాధ్యతలు చేపట్టారు. వీళ్లిద్దరూ అంతకు ముందు తమకే ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబట్టారు. మనోహర్ పారికర్ కు తాము మద్దతిచ్చామని, ఆయన లేకపోవడంతో ఇపుడు అన్నీ మారాయని వాదించారు. అమిత్ షా వారికి నచ్చజెప్పిన తర్వాత ఎంజీపీ సభ్యులు ఇద్దరు బీజేపీలో చేరిపోవడంతో ఎన్డీయే బలం 20కి చేరింది. దాంతో అసెంబ్లీలో తామే అతిపెద్ద పార్టీ అన్న కాంగ్రెస్ వాదనకు విలువ లేకుండా పోయింది.

మనోహర్ పారికర్ మరణించిన తర్వాత ఆదివారం సాయంత్రమే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గోవాకు వచ్చేశారు. తెల్లవారుజామున 5.30 వరకు చర్చలు జరిపినా, ఎలాంటి పరిష్కారం రాలేదు. ఒకవైపు దేశమంతా పారికర్ మరణానికి సంతాపాలు తెలుపుతుంటే మరోవైపు రాజకీయ చర్చలు కొనసాగాయి. చిట్ట చివరకు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన అమిత్ షా రంగప్రవేశం చేయడంతో ఒప్పందం కుదిరింది. ఇప్పుడు 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో బీజేపీకి 14 మంది ఎమ్మెల్యేలున్నట్లయింది. ఇప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య 36కు తగ్గగా, ఎన్డీయేకు 20 మంది మద్దతుంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 15 మందే. ఇద్దరు బీజేపీ సభ్యుల మరణం, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.