తుపాకులతో డ్యాన్స్ చేసిన వ్యక్తి ఎవరు?

హరిద్వార్‌: ఓ వ్యక్తి రెండు తుపాకులను రెండు చేతుల్లో పట్టుకుని డ్యాన్స్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. రెండు చేతులతో తుపాకులు పట్టుకుని హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ ఆ వ్యక్తి కనిపించాడు. ఓ ఇంట్లో ఈ వీడియోను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడమే కాకుండా.. ఉత్తరాఖండ్‌ పోలీసుల దాకా చేరింది. దీంతో స్పందించిన పోలీసులు సదరు వ్యక్తి ఎవరు? ఎప్పుడు జరిగింది? అన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్నది ఎవరో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నట్టు హరిద్వార్‌ సర్కిల్‌ అధికారి అభయ్‌ సింగ్‌ తెలిపారు. త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకుంటామన్నారు. ఈ ఘటన హరిద్వార్‌లోనే జరిగిందా? లేక మరెక్కడైనానా? అన్న విషయం దర్యాప్తులో తెలుస్తుందని తెలిపారు.

ఈ ఏడాది జూలైలో బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ కూడా ఇలానే డ్యాన్స్ చేసి పార్టీ నుంచి సస్పెండయ్యారు. ప్రణవ్ సింగ్ తాను ఓ ప్రజా ప్రతినిధిని అనే విషయం మర్చిపోయి.. ఐటమ్ సాంగ్‌కు తుపాకులు చేత్తో పట్టుకొని డ్యాన్స్ చేశాడు. చుట్టూ మందుబాబులను పోగేసుకొని అల్లర చిల్లరగా ప్రవర్తించాడు. ఎమ్మెల్యే చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయింది. ప్రణవ్ సింగ్ ప్రవర్తన బీజేపీకి తలనొప్పిగా మారాయి. దీంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పోలీసులు అతడి గన్ లైసెన్స్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే.