ఎస్ వీ బి సి చైర్మన్ పదవికి పృథ్వి రాజీనామా

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

తిరుపతి: ఆడియో లీక్ దుమారం నేపథ్యంలో  శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌ చైర్మన్‌ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. సి ఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధాంతాన్ని గౌరవిస్తూ చైర్మన్‌ పదవికి రాజీనామ చేస్తున్నట్టు పృథ్వీ ప్రకటించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పృథ్వి ఈ విషయాన్ని వెల్లడించారు.

ఒక మహిళతో పృథ్వీ అసభ్యంగా మాట్లాడినట్టు కొన్ని ప్రసార మాధ్యమాల్లో ఆడియో ప్రసారాలు కావడంతో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆడియో టేపుల్లోని వాయిస్‌ శాంపిల్‌ను టీటీడీ విజిలెన్స్‌ అధికారులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు.ఈ అంశాన్ని వైవీ సుబ్బారెడ్డి సీఎం జగన్‌ దృష్టికి కూడా తీసుకువెళ్లగా పృథ్వీని రాజీనామా చేయాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించినట్టు సమాచారం.

తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన పృథ్వీ తాను ఎటువంటి విచారణకైన సిద్దమేనని స్పష్టం చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. ఆ ఆరోపణలపై టీటీడీ విజిలెన్స్‌ అధికారులతో విచారణ జరిపించాలని కోరాను. నేను ఎస్వీబీసీ చైర్మన్‌గా 2019 జూలై 28న ప్రమాణం స్వీకారం చేశాను’అని చెప్పారు.

‘నేను ఏ పరీక్షకైనా సిద్దంగా ఉన్నాను. నాపై వచ్చిన అపవాదులు తొలగిపోయాక మళ్లీ బాధ్యతలు తీసుకుంటాను. నా రాజీనామాను ఫ్యాక్సులో పంపించా’ అని పృథ్వి తెలిపారు.