జనగణమనా శరణు..శరణు

నీరవ్ మోదీ స్కామ్‌లో చిక్కుకుని విలవిలలాడుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) జాతీయ గీతాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. ఇకమీదట వార్షిక సర్వసభ్య సమావేశాల్లో, అసాధారణ జనరల్ బాడీ మీటింగుల్లో జాతీయ గీతాన్ని ఆలపించాలని పిఎన్‌బి షేర్‌హోల్డర్ ఒకరు గత జనరల్ బాడీలో ప్రతిపాదించారు. దానిని ఛైర్మన్ సునీల్ మెహతా ఆమోదించారు.

ఈ నిర్ణయం ప్రకారం ఇకమీదట అన్ని సమావేశాల్లో జాతీయగీతం ఆలపిస్తారు.  సెబీ నిబంధనలు గానీ, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు గానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల జనరల్ బాడీ మీటింగుల్లో జాతీయగీతం ఆలపించాలని నిర్దేశించడం లేదు. ఇండియాలో మరో కంపెనీ ఏదీ ఇలా జాతీయగీతం ఆలపించాలని నిబంధన పెట్టినట్లు నాకైతే తెలియదు. ఎవరైనా గానీ సభ్యులపై జాతీయగీతాన్ని ఎందుకు రుద్దాలి అని ఇన్‌గవర్న్ రీసెర్చి సర్వీసెస్ కంపెనీ ఎమ్‌డి శ్రీరామ్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక పేర్కొన్నది.

నీరవ్ మోదీ స్కామ్ బయటపడిన తర్వాత పిఎన్‌బి మొండి బకాయిలను వసూలు చేసే కార్యక్రమం చేపట్టింది. ఈ ఆర్ధిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో 13,416 కోట్ల రూపాయల నష్టాన్ని బ్యాంకు ప్రకటించింది.