‘మూకదాడి పేరుతో దేశం పరువు పోతోంది’!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

‘నాగపూర్: మూక దాడులు భారతీయ సంస్కృతి కాదు. ఆ పనులు చేసి భారతదేశం పరువు తీయవద్దు’ ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ దసరా రోజున ఇచ్చిన సందేశం ఇది. నాగపూర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న భగవత్, ఇలాంటి దాడులు ఒక  మతం వారే చేస్తారని అనుకోనక్కరలేదని అన్నారు.

‘ఒక మతం వారు వేరొక మతం వారిపై దాడి చేస్తారని మనం వింటుంటాం. అదేం కాదు. ఇది అటునుంచి కూడా జరుగుతుంది. నిజంగా అలా జరిగిన సంఘటనలను వక్రీకరించిన సందర్భాలు ఉన్నాయి. రెండు మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు స్వార్ధపర శక్తులు ప్రత్యేకించి ఒక మతంపై నింద వేస్తాయి’ అని భగవత్ వ్యాఖ్యానించారు.

రాజ్యాంగం విధించిన పరిమితులకు లోబడి సమాజం వ్యవహరించాలని ఆయన అన్నారు. ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నా, ఎంతటి రెచ్చగొట్టే సంఘటన ఎదురయినా ఆ పరిధులు దాటకూడదని ఆయన పేర్కొన్నారు. కొన్ని సంఘటనలను మూకదాడులుగా అభివర్ణించడం నిజానికి దేశానికీ, హిందూమతానికీ చెడ్డ పేరు తెచ్చి కొన్ని మతాల వారిలో భయం కల్పించేందుకు జరుగుతున్న ప్రయత్నమని భగవత్ అన్నారు.

‘మూకదాడి (లించింగ్) నిజానికి మన పదం కాదు. పశ్చిమ దేశాల నుంచి వచ్చింది అది. వేరే మతగ్రంధంలో ఉన్న సంఘటనలో దాని పుట్టుక కనబడుతుంది. అలాంటి పదాలను భారతీయులపై రుద్దకండి’ అని ఆయన అన్నారు.