ఆర్టీసీ మూసివేత ఈజీ కాదు.. డెడ్‌లైన్లకు భయపడం!

హైదరాబాద్: ఆర్టీసీని మూసేయాలనుకుంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో అఖిలపక్ష నాయకులతో జేఏసీ నేతల సమావేశం జరిగింది. అనంతరం జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 30 శాతం వాటా ఉందని, ఆర్టీసీని మూసేయాలనుకుంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవని చెప్పారు. ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం ప్రకారం చేసేది కాదన్నారు. కార్పొరేషన్‌ను మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆర్టీసీ కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. చర్చలకు పిలవకుండా కార్మికులను భయపెట్టేలా ప్రకటనలు చేస్తున్నారని… ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు కార్మికులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎన్ని డెడ్ లైన్లు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో ఇలాంటి సీఎంలను చాలామందినే చూశామన్నారు. కానీ కోర్టు ఆదేశాల్ని ధిక్కరించిన ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు.  కార్మికుల సమస్యలు సీఎంకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిఇలా ఉంటే.. సమ్మెలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లోకి చేరడానికి మంగళవారం అర్ధరాత్రి వరకు తెలంగాణ ప్రభుత్వం డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పలుచోట్ల కేసీఆర్ ప్రకటనతో భయాందోళనలు వ్యక్తం చేసిన ఆర్టీసీ కార్మికులు డ్యూటీల్లో చేరారు. తాము డ్యూటీల్లో చేరుతున్నట్లు పై అధికారులకు లిఖిత పూర్వకంగా రాసిచ్చారు.