ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎటువైపు?

 

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పరిష్కారానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జిలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు సూచనకు ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో కార్మికుల సమ్మె ఎటు వైపు వెళ్తుంది? అనేదానిసై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం దిగి రాకపోవడంతో ఇప్పటికే కొంతమంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రోజులు గడుస్తున్న కొద్ది.. కార్మికుల్లో ఆందోళన మరింత తీవ్రతరం అవుతోంది. దీంతో వారు ఆత్మహత్యల దిశగా ఆలోచిస్తుండటంపై విచారం వ్యక్తమవుతోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపండి.. సమస్య పరిష్కరించండి అంటూ హైకోర్టు చేసిన సూచనలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సమ్మె ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 27మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా మహబూబాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న ఆవుల నరేష్ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమ్మెపై హైకోర్టు ఎటూ తేల్చకపోవడం, రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన నరేష్ పురుగులు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆర్టీసీ డ్రైవర్‌ నరేష్‌ ఆత్మహత్య నేపథ్యంలో గురువారం మహబూబాబాద్ జిల్లా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. డ్రైవర్ నరేష్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యేనని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. తమ పోరాటంలో న్యాయం ఉందని, అంతిమంగా తామే విజయం సాధిస్తామన్నారు. కోర్టు సూచనలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. త్వరలో అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్‌పై మంత్రులు ఒత్తిడి తేవాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆందోళనకు గురికావద్దన్నారు.

మరోవైపు సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 40వ రోజుకు చేరుకుంది. తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌కి ఆర్టీసీ సమ్మె సెగ తగిలింది. భద్రాచలంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన మంత్రిని.. భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద ఆర్టీసీ కార్మికులు,వామపక్ష నాయకులు అడ్డుకున్నారు. కాన్వాయ్‌కి అడ్డుపడి మంత్రిని అక్కడి నుంచి కదలనిచ్చేది లేదని రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి, మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే కార్మికులు అక్కడ నుంచి కదలకపోవడంతో మరో మార్గంలో మంత్రి కాన్వాయ్‌ని అక్కడినుంచి పంపించారు.

ఆర్టీసీ సమ్మె కేసు వరుసగా వాయిదా పడటంతో కార్మికులను ఆత్మరక్షణలో పడేసేందుకే ప్రభుత్వం ఆలోచన చేస్తుందా అనే అనుమానం కలుగుతోంది. బంద్ అయిపోయిన తరువాత మరో కార్యాచరణ ప్రకటనకు జేఏసీ సిద్దం అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండకూడదని భావిస్తున్నాయి. సమ్మెను ఉద్ధృతం చేసే దిశగా కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించాయి. దీంతో అసలు ఈ వ్యవహారం ఎటు టర్న్ అవుతుందనే అనే ఉత్కంఠ కార్మికుల్లో కనిపిస్తోంది.