బంద్ సంపూర్ణం.. నెక్ట్స్ ఏంటి?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె గత 16 రోజులుగా సాగుతూనే ఉంది. ఈ సమ్మెపై ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో ఆర్టీసీ జేఏసీ సమ్మెని ఉదృతం చేయాలనీ భావిస్తుంది. ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ శనివారం నిర్వహించిన తెలంగాణ బంద్ విజయవంతం అయిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు భవిష్యతు ప్రణాళికపై దృష్టి సారించారు. ఇకపై సమ్మెను మరింత ఉద్ధృతం చేయనున్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింపజేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చేసిన సూచనను ముఖ్యమంత్రి కేసీఆర్ లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. సమ్మె మొదలై 16 రోజులు పూర్తైనా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం, హైకోర్టు సూచనల్ని కూడా పక్కన పెట్టి, చర్చల అంశాన్ని అటకెక్కించడంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు.

ఆదివారం రాజకీయ పార్టీల నేతలతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశం కానున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఆదివారం ప్రజలకు గులాబీలు ఇచ్చి… ఆర్టీసీ ప్రాముఖ్యత, అవసరాన్ని వివరిస్తారు. అలాగే సుందరయ్య భవన్‌లో రాజకీయ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సమావేశం అవుతారు. ఇప్పటివరకూ సమ్మె ఎలా జరిగింది? ఇకపై ఎలా జరగాలి అన్నదానిపై చర్చిస్తారు. కొత్త కార్యాచరణ సిద్ధం చేసుకోనున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కానీ ప్రభుత్వం నుంచీ అలాంటి సంకేతాలేవీ కనిపించట్లేదు. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా ఓయూ జేఏసీ అక్టోబర్ 23న ఉస్మానియా క్యాంపస్‌లో భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఈ సభలో ఆర్టీసీ జేఏసీ నేతలు పాల్గొననున్నారు. కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిఇలా ఉంటే.. ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వని ప్రభుత్వం… అద్దె బస్సులకు కూడా ఇవ్వాల్సిన అద్దె ఇవ్వలేదు. దీంతో అద్దె బస్సుల యజమానులూ ఆందోళనకు గురవుతున్నారు. ప్రతిసారి ఠంచనుగా డబ్బు చెల్లించే యాజమాన్యం.. సమ్మె నేపథ్యంలో సెప్టెంబరు చెల్లింపులు నిలిపివేయడంపై వారు ఆగ్రహంగా ఉన్నారు. సమ్మె కారణంగా నిర్దేశిత కిలోమీటర్లు తిరగక నష్టపోతుంటే.. చెల్లింపులు కూడా నిలిపివేస్తే ఎలా అని వాపోతున్నారు. బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐలు చెల్లించేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో మొత్తం 10,460 బస్సులున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త బస్సులను కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో ‘ప్రైవేటు హైర్‌ బస్(పీహెచ్‌బీ)’ స్కీమును ఆర్టీసీ అమల్లోకి తెచ్చింది. ప్రైవేటు యాజమాన్యాల నుంచి బస్సులను అద్దెకు తీసుకుని, వారికి కిలోమీటరుకు ఎంతో కొంత చెల్లిస్తోంది.

ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 10,460 బస్సులు ఉండగా, ఇందులో 8,357 ఆర్టీసీ బస్సులు, 2103 అద్దె బస్సులు ఉన్నాయి. వీటికి కిలోమీటరుకు రూ.7-10 వరకు చెల్లిస్తుంటారు. ఇలా ఒక్కో బస్సుకు నెలకు కనీసం రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 2103 బస్సులకు నెలకు రూ.21 కోట్ల వరకు చెల్లించాలి. ప్రతినెలా 10న ఈ బిల్లులను ఠంచనుగా చెల్లిస్తారు. కానీ సెప్టెంబరు నెల చెల్లింపులు మాత్రం ఇప్పటివరకు జరగలేదు. కార్మికుల సమ్మె వల్ల వాటికి అద్దె చెల్లింపులు నిలిచిపోయాయి. అద్దె బస్సులు నిర్దేశిత షెడ్యూలు కిలోమీటర్లు తిరిగితేనే.. వాటికి పూర్తి స్థాయి బిల్లులు వస్తాయి. కిలో మీటర్లు తగ్గితే బిల్లుల్లోనూ కోత పెడతారు. ఇదిఇలా ఉంటే.. ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని చెబుతున్న సీఎం కేసీఆర్.. ఎలాంటి వ్యూహాంతో ముందుకు వెళ్తున్నారో అంతుచిక్కడం లేదు.