సజ్జన్ కుమా‌ర్‌కు జీవితఖైదు

కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. 1984 సిక్కుల ఊచకోత కేసులో ప్రత్యేక కోర్టు సజ్జన్ కుమార్ ను నిర్దుషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును ఢిల్లీ కోర్టు పక్కన పెట్టేసింది.సజ్జన్ కుమార్ ను దోషిగా నిర్ధారిస్తూ…జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

సిక్కుల ఊచకోత కేసులో బాధితులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సవాళ్లు ఎదురైనా వాస్తవం చివరకు నిలుస్తుందని వారికి విశ్వాసం కలిగించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. నవంబర్  1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆమె అంగరక్షకుల చేతిలో హత్యకు గురైన

అనంతరం ఢిల్లీలో సిక్కుల లక్ష్యంగా జరిగిన అల్లర్లలో దాదాపు 3వేల మంది సిక్కులు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి 74 ఏళ్ల సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పిన ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో దోషులు రాజకీయ ప్రాపకం కలవారని పేర్కొంది. అలాగే ఈ కేసు దర్యాప్తులో పోలీసుల వైఫల్యాన్ని కూడా ఎత్తి చూపింది.

సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. బాధితులకు ఇన్నాళ్లకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. మూక దాడులలో ప్రమేయమున్న వారెవరూ తప్పించుకోవడానికి వీలు లేదని ఆయన అన్నారు.