పోలీసు ఆంక్షలు బేఖాతరు:హైవేలను దిగ్బంధించిన నేతలు

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ నిర్వహిస్తున్న ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా అమరావతి పరిరక్షణ సమితి (జెఎసి) మంగళవారం జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపు ఇవ్వగా దీనికి టిడిపి మద్దతు ప్రకటించింది. జాతీయ రహదారి దిగ్బంధానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ముందస్తు చర్యలో భాగంగా టిడిపి, జెఎసి ముఖ్యనేతలను హౌస్ అరెస్టు చేయడంతో పాటు వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

పోలీస్ అంక్షలు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు జాతీయ రహదారులపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. చిన కాకాని వదద్ జాతీయ రహదారిపై రైతులు భైటాయించి పోలీసుల బూట్లు తుడుస్తూ నిరసన తెలిపారు. భారీగా చేరుకున్న పోలీసు బలగాలు ఎక్కడికక్కడ రైతులను అరెస్టు చేసి హాయ్ ల్యాండ్‌, గుంటూరుకు తరలించారు. రైతులు హాయ్ ల్యాండ్‌లో ఎండలోనే కూర్చుని నిరసన తెలిపారు. వేలాది మంది రైతులు హైవేపైకి చేరుకోవడంతో దాదాపు రెండ కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చిన కాకాని వద్ద ట్రాఫిక్‌లో చిక్కకున్నారు. అతి కష్టం మీద పోలీసులు రోడ్డుపై భైటాయించిన రైతులను పక్కకు తప్పించి మంత్రి కాన్వాయ్ వెళ్లేందుకు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. హైవేపై భైటాయించిన టిడిపి గుంటూరు జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులును పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ఆందోళనలో పాల్గొనే రైతుల కోసం సిద్ధం చేసిన ఆహారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరో పక్క గొల్లపూడి వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తొలుత పోలీసులు ఉమాను నివాసం వద్ద అడ్డుకుని నిర్బంధించారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నిర్బంధం నుండి దేవినేని ఉమాను గొల్లపూడి గ్రామస్తులు, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి బయటకు తీసుకొచ్చారు. అక్కడ నుండి దేవినేని ఉమా రిలేదీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. అనంతరం మహిళలు, రైతులతో కలిసి ఉమా జాతీయ రహదారిపైకి చేరుకుని భైటాయించారు. రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఉమా, నిరసనకారులను అడ్డుకున్నారు. ఆందోళనలను అడ్డుకుంటే ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని ఉమా హెచ్చరించారు.