సర్దుబాటుపై చర్చలు

విజయవాడ, మార్చి 16: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ల స్వీకరణ గడువు మరో రెండు రోజుల్లో ప్రారంభం అవ్వనుండటంతో ఎన్నికల పొత్తులు, సీట్ల సర్దుబాటును ఫైనల్ చేసేందుకు జనసేన చర్యలు చేపట్టింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ పార్టీ కార్యాలయంలో శనివారం వామపక్ష నేతలతో సమావేశం అయ్యారు.

పొత్తులో భాగంగా వామపక్షాలు 26 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలు అడుగుతున్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు.

వామపక్షాలతో పాటు తాజాగా బిఎస్‌పితోనూ పొత్తుతో ఎన్నికల గోదాలోకి దిగేందుకు జనసేన సన్నద్దం అయ్యింది. ఎప్రిల్ మూడు, నాలుగు తెదీల్లో బిఎస్‌పి అధినేత్రి మాయావతితో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.

ఇప్పటికే జనసేన నాలుగు పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీకి 32మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే.

సమావేశంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు తదితర నేతలు పాల్గొన్నారు.