తుది దశకు అయోధ్య కేసు!

                                                                                                                                            (న్యూస్ ఆర్బిట్ డెస్క్)

దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న అయోధ్య రామజన్మభూమి, బాబ్రీమసీదు వ్యవహారం కీలక దశకు చేరింది. దశాబ్దాలుగా వాదనలు, ప్రతివాదనలు జరుగుతున్న అయోధ్య వివాదంపై విచారణ సుప్రీం కోర్టులో తుది దశకు చేరుకుంది. నేటి(సోమవారం) నుంచి ఈ కేసుపై ధర్మాసనం ఇరు పక్షాల వాదనలను విననుంది. వారం రోజుల దసరా విరామం అనంతరం మరోసారి కేసు విచారణను సుప్రీం ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 17 వరకు వాదనలకు అవకాశం కల్పించింది. తర్వాత నెల రోజుల్లో తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగానే అయోధ్యలో భద్రత కట్టుదిట్టం చేశారు. డిసెంబర్ 10వ తేదీ వరకు దాని పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

అక్టోబరు 17 లోపు ఇరువర్గాలు వాదనలు వినిపించడం పూర్తిచేయాలని సుప్రీం ఇప్పటికే తేల్చి చెప్పింది. నవంబర్ 17 జస్టిస్ రంజన్‌ గొగోయ్‌ రిటైర్మెంట్‌ తీసుకోనుండటంతో ఆ రోజే అయోధ్య అంశంపై తీర్పు రానుంది. ఈ అంశంపై ఇప్పటి వరకు మొత్తం 37 సార్లు వాదోపవాదనలు జరిగాయి. ఈ అంశం సున్నితమైనది కావడంతో తీర్పు ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో ఒక భూభాగం కేంద్ర బిందువుగా ఉన్న వివాదానికి సంబంధించిన కేసు ఇది. హిందూ దేవుడైన రాముడి జన్మస్థలంగా హిందువులు పరిగణించే స్థలంతో పాటు.. బాబ్రీ మసీదు కూడా ఉన్న స్థలం ఇది.  అయోధ్యలో బాబ్రీ మసీదు విషయంలో హిందువులు, ముస్లింల మధ్య శతాబ్ద కాలానికి పైగా వివాదం నడుస్తోంది. 1992లో హిందువుల గుంపు మసీదును కూలగొట్టడంతో ఈ వివాదం మొదలైంది. ఆ ఘటన నేపథ్యంలో జరిగిన మత అల్లర్లలో దేశవ్యాప్తంగా దాదాపు 2,000 మంది చనిపోయారు. ఆ ఉదంతం తర్వాత అయోధ్యలోని భూమి మీద యాజమాన్యానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది. ఈ కేసులో 2010 సెప్టెంబర్ 30వ తేదీన తీర్పు ప్రకటించారు. అలహాబాద్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు.. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించాలని.. అందులో ఒక భాగం హిందూ మహా సభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు వెళుతుందని తీర్పు చెప్పారు. అయోధ్యలోని వివాదాస్ప స్థలమైన 2.77 ఎకరాలను సున్ని వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అకాఢా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని పేర్కొంటూ అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే, దీనిపై హిందువులు, ముస్లింలు సుప్రీంకోర్టులో అప్పీలు చేయటంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ తీర్పును సస్పెండ్ చేసింది.

ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నవంబర్‌లో తీర్పు వెలువడే అవకాశముంది. అయోధ్య భూవివాదం కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సారథ్యం వహిస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్ 2019 నవంబర్ 17వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో 2019 నవంబర్ 17వ తేదీలోపే తీర్పు రావచ్చని భావిస్తున్నారు.