‘మహా’ సీఎం సీటుపై లొల్లి!

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా బీజేపీ-శివసేన కూటమి పయనిస్తోంది. అయితే మహారాష్ట్ర సీఎం పీఠాన్ని అధిరోహించేది ఎవరు అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న శివసేన .. సీఎం కుర్చీని చెరిసగం పంచుకోవాలని ఆశిస్తోంది. అయితే, ఇందుకు బీజేపీ అంగీకరిస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.  మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో ఈ కూటమి 163 స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 95 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 28 స్థానాల్లో గెలుపు బాటలో ఉన్నారు. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా.. ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.

ఇక ఈ ఎన్నికలలో శివసేనతో కలిసి పోటీ చేసినప్పటికీ.. తామే సొంతంగా అధికారంలోకి వస్తామని ముందు బీజేపీ అంచనావేసింది. కానీ ఆ పార్టీ ఇప్పుడు వంద స్థానాలకు పైగా మెజార్టీలో ఉంది. బీజేపీ బలం గతంలో పోలిస్తే ఈసారి కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనతో విభేదాలు వచ్చి ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ..122 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ఈ సారి వందకుపైగా స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు శివసేన 70కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దీంతో సీఎం కుర్చీని పంచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్‌రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి శివసేనకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పదవులు కూడా సగం, సగం పంచుకోవాలని చెప్పారు. వర్లి నుంచి పోటీ చేసిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీని కోరతామని సంజయ్ రౌత్ తెలిపారు.

ఇంకా అధికారంలోకి రాకుండానే ఈ కూటమి మధ్య సీఎం కుర్చీ లొల్లి మొదలైంది. మరోవైపు చెరో రెండున్నర్రేళ్లు అధికారంలో ఉండాలన్న ప్రతిపాదన కూడా ఇరు పార్టీల మధ్య నడుస్తున్నట్లు తెలుస్తోంది. 50-50 ఫార్ములా అమలు చేయాలి శివసేన నేతలు అంటున్నారు. ఈ విషయమై శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేతో చర్చించేందుకు పార్టీ కార్యకర్తలు ఆయన నివాసానికి పోటెత్తారు. ఆదిత్య ఠాక్రేను సీఎంను చేయాలన్నది శివసేన వ్యూహంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో తమ కూటమి గెలుపొందితే దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి సీఎం బాధ్యతలు చేపడతారని ఇటీవల పలుసార్లు బీజేపీ నేతలు చెప్పారు. అయితే, శివసేన డిమాండ్ పై బీజేపీ స్పందిస్తుందో చూడాలి.