పాకిస్థాన్ వెళ్లిపోండి: ఎస్పీ వివాదాస్పద వ్యాఖ్యలు

లక్నో: దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీపై నిరసనలు కొనసాగుతున్న వేళ.. ముస్లిమ్ నిరసనకారులను పాకిస్థాన్ దేశానికి వెళ్లిపోండంటూ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సమయంలో పరిస్థితిని సమీక్షించేందుకు మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ డిసెంబర్ 20వ తేదీన ఇతర పోలీసులతో కలిసి పలు వీధుల్లో కలియ తిరిగారు. ఈ క్రమంలో ఓ ప్రాంతంలో ఆగిన ఎస్పీ.. అక్కడే ఉన్న కొందరు ముస్లింలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు అని ఎస్పీ వారిని ప్రశ్నించారు. తాము నమాజ్ చేసుకోవడానికి మసీదుకి వెళ్తున్నామని ఓ వ్యక్తి ఎస్పీకి బదులిచ్చారు. ‘అది.. సరే.. మరి మీ దుస్తులపై నలుపు, నీలం రంగు బ్యాడ్జులు ఎందుకు ఉన్నాయి’ అని ఎస్పీ ప్రశ్నించారు. ‘ఈ వీధిని నేను చక్కదిద్దుతాను, మీరంతా పాకిస్తాన్ వెళ్లిపోండి. భారత దేశంలో ఉండాలని ఇష్టం లేకపోతే వెంటనే వెళ్లిపోండి. ఎక్కడెక్కడో వాళ్లంతా వచ్చి భారత దేశంలో ఉంటున్నారు’ అని ఎస్పీ అఖిలేష్ వ్యాఖ్యానించారు. ప్రతి ఇంట్లో నుంచి ఒక్కొక్కరిని తీసుకెళ్లి జైల్లో పెడతాను అని హెచ్చరించారు. అసభ్య పదజాలం కూడా ఉపయోగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యూపీ పోలీసుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఎస్పీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడితే ఎలా అని నెటిజన్లు ప్రశ్నించారు. ఎస్పీ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని స్థానికులు డిమాండ్ చేశారు. ఎస్పీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఆందోళనకారులు పాకిస్థాన్ కి అనుకూలంగా నినాదాలు చేసినందు వల్లే తాను పాక్ కు మద్ధతుగా ఎందుకు నినాదాలు చేస్తున్నారని ప్రశ్నించానని ఎస్పీ అఖిలేష్ వివరించారు. దేశాన్ని ప్రేమించే వారు పాక్ అనుకూల నినాదాలను సహించలేరని ఎస్పీ చెప్పారు. ‘మమ్మల్ని చూసిన కొందరు కుర్రాళ్ళు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసి పరిగెత్తడం ప్రారంభించారు. మీరు ఇలాంటి నినాదాలు చేసి భారత్‌ను ద్వేషిస్తే పాకిస్థాన్‌కు వెళ్లండి అని నేను వారికి చెప్పాను ‘ అని వివరించారు.

కాగా, యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది అరెస్ట్ అయ్యారు. హింసాత్మక ఘటనల్లో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా 19 మంది చనిపోగా, వెయ్యి మందికి పైగా అల్లర్ల కేసుల్లో అరెస్ట్‌ అయ్యారు.పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనల్లో 288 మంది పోలీసులు గాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లతో సంబంధం ఉందనే ఆరోపణలలతో 1,113 మందిని అరెస్ట్‌ చేశారు.