భారతీయుల ఫోన్లు హ్యాక్ చేసిన ఇజ్రాయిల్ స్పై వేర్!

న్యూఢిల్లీ: భార‌తీయ జ‌ర్న‌లిస్టులు, సామాజిక కార్యకర్తలకు సంబంధించిన వాట్సాప్ అకౌంట్ల‌ను ఇజ్రాయిల్ స్పైవేర్ నిఘా సంస్థ హ్యాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఈ విష‌యాన్ని ధృవీక‌రించింది. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్‌వో అనే సంస్థ రూపొందించిన పెగాస‌స్ స్పైవేర్ ద్వారా ఈ నిఘా జరిగింది. ఆ సంస్థ గ్రూపుపై దావా వేయ‌నున్న‌ట్లు వాట్సాప్ తెలిపింది. సుమారు 1400 మంది యూజ‌ర్ల ఫోన్ల‌ను హ్యాక్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ  తమ స్పైవేర్ ద్వారా హ్యాక్ చేసిన వారిలో 20 దేశాలకు చెందిన జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు, ప్రభుత్వ ఉన్న‌తాధికారులు ఉన్నారు.

ఫోన్‌ను హ్యాక్ చేసిన స్పైవేర్ .. యూజర్ల మెసేజ్‌ల‌ను, కాల్స్‌, పాస్‌వ‌ర్డ్‌ల‌ను చోరీ చేసింది. ఫోన్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌పై అటాక్ చేసిన త‌ర్వాత దాంట్లో ఉన్న డేటాను దొంగ‌లించారు అయితే క‌చ్చితంగా ఎంత మంది ఫోన్లు హ్యాక్ అయ్యాయ‌న్న విష‌యాన్ని మాత్రం వాట్సాప్ స్ప‌ష్టం చేయ‌లేక‌పోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దాదాపు రెండు వారాల పాటు భార‌తీయ జ‌ర్న‌లిస్టుల‌ు, మాన‌వ హ‌క్కుల కార్యకర్తల వాట్సాప్ స‌మాచారాల‌పై ఇజ్రాయిల్ కంపెనీ నిఘా పెట్టిన‌ట్లు తెలుస్తోంది. సైబ‌ర్ దాడి జ‌రిగిన‌ట్లు ఈ ఏడాది మే నెల‌లో ఫేస్‌బుక్ సంస్థ గుర్తించి దానిని బ్లాక్ చేసినట్లు ప్రకటించింది.

వీడియో కాల్ చేస్తున్న స‌మ‌యంలో ‘పెగాస‌స్’ అనే స్పైర్‌వేర్ ఫోన్‌లోకి ప్ర‌వేశిస్తుంది. ఒక‌వేళ ఫోన్ మాట్లాడ‌కున్నా.. వైర‌స్ మాత్రం ఫోన్లో ఇన్‌స్టాల్ అవుతుంది. వైర‌స్ కోడ్‌తో ఫోన్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను హ్యాక్ చేసి.. యూజ‌ర్ డేటాను యాక్సెస్ చేస్తారు. అయితే, ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్ఓ మాత్రం ఈ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తున్న‌ది. ‘ప్రస్తుత ఆరోపణలతో మేము విభేదిస్తున్నాం. మా సాంకేతికతను మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఉపయోగించడం కోసం రూపొందించలేదు’ అని కంపెనీ పేర్కొంది.