155 స్థానాలకు శివసేన పట్టు

భారతీయ జనతా పార్టీ  జాతీయ అధ్యక్షుడు శివసేన తమతో సఖ్యతగానే ఉందని పదే పదే చెబుతున్నా…అదేమీ నిజంగా కనిపించడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీపై, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ పై శివసేన విమర్శల దాడి చేస్తూనే ఉంది. రామమందిరం నుంచి కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వరకూ   వ్యతిరేకతను ఏకంగా శివసేన అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయాల రూపంలో ప్రచురిస్తున్నది. తాజాగా మహా రాష్ట్ర ఎన్నికలలో బీజేపీ- శివసేన పొత్త కొనసాగాలంటే తమకు 155 స్థానాలు కేటాయించాలని షరతు పెట్టింది. శివసేనకు 155 స్థానాలు కేటాయిస్తేనే బీజేపీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

హిందీ బెల్ట్ మూడు రాష్ట్రాలలో ఇటీవల జరిగిన అసెంబ్ల ీఎన్నికలలో అధికారం కోల్పోయి ఒత్తిడి లో ఉన్న బీజేపీకి  మిత్రపక్షం అయిన శివసేన నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురౌతున్నది. మహా అసెంబ్లీ ఎన్నికలలో 155 స్థానాలు కేటాయించాలన్న డిమాండ్ తో పాటు…సార్వత్రిక ఎన్నికలతో పాటే మహా అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని పట్టుపడుతోంది.  288 స్థానాలున్న మహా రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ కావాలంటే కనీసం 145 స్థానాలు  అవసరం. అంటే శివసేన అడుగుతున్న సీట్లు బీజేపీ అవసరం లేకుండానే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసినంత బలం సొంంతంగా ఉండాలని చెబుతున్నదన్నమాట. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 121 మంది ఎమ్మెల్యేలు ఉండగా, శివసేన బలం 63. ఇంత భారీగా శివసనే  స్థానాల కోసం పట్టుబడుతున్నప్పటికీ కమలం పార్టీ మాత్రం చర్చిద్దాం అంటూ బుజ్జగిస్తున్నది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు శివసేనకు 138 స్థానాలు కేటాయించేందుకు ఇప్పటికే సూత్ర ప్రాయంగా అంగీకరించింది. మిగిలిన 150 స్థానాలలోనూ బీజేపీ అభ్యర్థులను రంగంలోనికి దించడానికి అంగీకరించింది. అంతే కాకుండా ఇరు పార్టీలకూ ఆమోదమైన సంఖ్య కోసం చర్చలు జరుపుదాం అని శివసేనను కోరుతోంది. మహారాష్ట్రలో ఎలాగైనా శివసేనను దూరం చేసుకోవద్దన్న పరిస్థితిలో బీజేపీ ఉందని ఈ పరిణామాలను బట్టి అవగతమౌతుంది. ఈ రోజు ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా శివసేన తమ మిత్రపక్షమేననీ, 2019 సార్వత్రిక ఎన్నికలలో కలిసే పోటీ చేస్తామని చెప్పడం గమనార్హం.