(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సంస్కృతం మాట్లాడితే షుగర్, కొవ్వు తగ్గుతాయా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాడు ఆ పెద్దమనిషి. ఈ మాటలు అన్నది సాదాసీదా వ్యక్తి కూడా కాదు. భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు గణేష్ సింగ్.
సంస్కృతం మాట్లాడితే డయాబిటిస్, కొవ్వు తగ్గుతుందని గణేశ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని ఓ విద్యాసంస్థ చేసిన రీసెర్చ్‌లో ఈ విషయం తేలిందని కూడా సెలవు ఇచ్చారు. సంస్కృతం మాట్లాడటం వల్ల నరాల వ్యవస్థను పెంచుతుందనీ, దాని వల్ల డయాబటిస్, కొవ్వు అదుపులో ఉంటుందని ఆయన చెప్పుకొస్తున్నారు. అంతే కాకుండా కంప్యూటర్ ప్రోగ్రామ్‌లో సంస్కృతాన్ని ఉపయోగించినట్లైయితే అది ఆగకుండా పని చేస్తుందట. ఈ విషయం నాసా చేసిన ఓ సర్వేలో తేలిందని పేర్కొనడం గమనార్హం.
మరో విషయం ఏమిటంటే ఇస్లామిక్ భాషలతో సహా ప్రపంచంలోని 97 శాతం భాషలు సంస్కృతం నుండే ఉద్భవించాయని ఆయన చెపుతున్నారు.
కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి మాట్లాడుతూ సంస్కృత భాష మాట్లాడేందుకు చాలా బాగుంటుందనీ, అందులో ఒక్కో పదాన్ని ఎన్నో విధాలుగా వాడుకోవచ్చనీ తెలిపారు. బ్రదర్, కౌ అనే ఇంగ్లీషు పదాలు కూడా ఈ భాష నుండే పుట్టినవేనని ఆయన సెలవు ఇస్తున్నారు.