శబరిమల, రాఫెల్ పిటిషన్లపై తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు… గరువారం మరో రెండు కీలక కేసులకు సంబంధించిన తీర్పును వెలువరించనుంది. శబరిమలలో మహిళల ప్రవేశం, రాఫెల్ డీల్ కి సంబంధించి దాఖలైన పిటిషన్ లపై తుది తీర్పును ప్రకటించనుంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతేడాది సెప్టెంబరు 28న ఐదుగురు జడ్జిలతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుపై అయ్యప్ప భక్తులు, హిందువులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మహిళలను శబరిమలలో ప్రవేశించకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో రివ్యూ పిటిషన్‌కు సుప్రీంకోర్టు అనుమతించింది. దీనిపై మొత్తం 56 పిటిషన్ల దాఖలు కాగా, చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనుంది.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేరళలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. శబరిమలలో పది వేల మంది పోలీసులను మోహరించారు. గతేడాది తీర్పు తర్వాత శబరిమలలో తలెత్తిన ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. గతేడాది ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ఇక రాఫెల్ కేసులో తీర్పుని రిజర్వ్ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తుది తీర్పు ఇవ్వనుంది. రాఫెల్ కేసులో 2018 డిసెంబర్-14న కేంద్రప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇస్తూ సుప్రీం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం తీర్పుపై మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ సుప్రీంలో రివ్యూ పిటిషనన్లు దాఖలు చేశారు. రాఫెల్ డీల్ లో అవకతవకలు జరిగాయని పత్ర్యేక దర్యాప్తు బృందంతో ఈ ఒప్పందంపై విచారణ జరిపించాలని వారు కోరారు. ఈ రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టులో మార్చి-14, 2019 వాదనలు ముగిశాయి.

సుప్రీంలో వాదనల సందర్భంగా రాఫెల్ ఒప్పందంపై కోర్టుకి అందించిన కాగ్ నివేదికలో పొరపాటు జరిగిందని ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకి తెలిపారు. కేంద్రం దాఖలు చేసిన నివేదికలో మొదటి మూడు పేజీలు లేవని వాటిని రికార్డుల్లో చేర్జేందుకు అనుమతి ఇవ్వాలని వేణుగోపాల్ కోరారు. లీకైన రాఫెల్ పత్రాలను పిటిషన్ల నుంచి తొలగించాలని కోరారు. దేశ భద్రత దృష్ట్యా గోప్యత పాటించాల్సిన డాక్యుమెంట్లుగా వాటిని పరిగణించాలని కోరారు. రివ్యూ పిటిషన్లను కొట్టి వేయాలని కోరారు. అయితే, అటార్నీ జనరల్ వ్యాఖ్యలపై పిటిషనర్ ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాఫెల్ డీల్ కు సంబంధించిన పత్రాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ప్రశాంత్ భూషన్ అన్నారు. అంతగోప్యత పాటించాల్సిన పత్రాలు లీకైనప్పుడు కేంద్రం ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. సుదీర్ఘంగా గంటపాటు వాదనలు జరిగిన తర్వాత తీర్పుని రిజర్వ్ చేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది. రాఫెల్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.