(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
వాట్సాప్ యూజర్లపై పన్ను వేయాలన్న ప్రతిపాదన ఆ దేశ ప్రధాని పదవికి ఎసరు తెచ్చింది. లెబనాన్ ప్రధానమంత్రి సాద్ అల్ హరీరి మంగళవారం తన పదవికు రాజీనామా ఇచ్చారు.
రెండు వారాల క్రితం లెబనాన్ ప్రభుత్వం నిధుల సేకరణ కోసం వాట్సాప్ యూజర్ల నుంచి నెలకు ఆరు డాలర్ల మేరకు పన్ను వసూలు చేయాలని ప్రతిపాదించింది. వెంటనే జనం రాజధాని బీరూట్ వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వం తక్షణం ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. అయినా నిరసనలు ఆగలేదు.
నిజానికి లెబనాన్ పాలకవర్గాలపై ప్రజల్లో ఆగ్రహం గూడు కట్టుకుఉంది. దేశం విద్యుత్తు, నీటి కొరత ఎదుర్కొంటున్నది. పాలకవర్గాలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాట్సాప్ యూజర్లపై పన్ను ప్రతిపాదన ఆ ఆగ్రహాన్ని బయటకు తెచ్చింది. ఇప్పుడు నిరసనకారులు వ్యవస్థాగత సంస్కరణలు డిమాండ్ చేస్తున్నారు.
మరో దారి కనబడక రాజీనామా చేశానని ప్రధాని హరేరి చెప్పారు. అయితే ఆయన రాజీనామా సంక్షోభాన్ని పరిష్కరించే సూచనలు కనబడడం లేదు. అధ్యక్షుడు అవున్ ఆ రాజీనామాను ఆమోదించేదీ లేనిదీ ఇంకా తెలియలేదు. నిరసనకారులయితే దేశాధ్యక్షుడు, స్పీకర్ కూడా రాజీనామా చేయాలని కోరుతున్నారు.