ఏపీ ‘రాజధాని’పై పోటాపోటీ సమావేశాలు

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఏపీలో రాజధాని రాజకీయం మరింత వేడెక్కింది. రాజధాని అమరావతి నిర్మాణంపై టీడీపీ, వైసీపీలు పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేశాయి. గురువారం విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజారాజధాని అమరావతి పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. రాజధానిపై జగన్ సర్కార్ తీరును విమర్శించే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల భూములు తీసుకొని, నిధులు వెచ్చించి చేపట్టిన పనుల నిర్మాణంపై వివరిస్తారు. రాజధాని మార్పుపై పూటకో మాట మాట్లాడి ప్రజల్లో అభద్రతాభావం కలిగిస్తున్నారనే విషయంపై కూడా రౌండ్ టేబుల్ సమావేశం దృష్టిపెట్టనుంది. అంతే కాకుండా.. చంద్రబాబు బస్సు పర్యటన సమయంలో జరిగిన ఆందోళనను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల అభిప్రాయాలను తీసుకుని… రాజధానిపై పోరాటాన్ని ఉదృతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

మరోవైపు చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం అనే పేరుతో వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో గుంటూరు జిల్లా తుళ్లూరులో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు. రాజధాని పేరుతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయంపై సమావేశంలో పాల్గొన్న పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పేరుతో టీడీపీ నేతలు అవినీతి సామాజ్యాన్ని ఏర్పాటు చేశారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు, ఆయన బినామీలు రాజధానిని ప్రకటించకముందే ఇన్‌సైడర్‌ పేరుతో భూములు కొనుగోలు చేశారని రైతులు చెబుతున్నారు. భూములు తీసుకున్న రైతులకు ప్లాట్లు ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. తమ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలపాలంటూ ప్రశ్నిస్తున్నారు. రాజధాని పేరుతో దళితులకు గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

అమరావతిలో రాజధానిపై టీడీపీ, వైసీపీ పోటా పోటీ సమావేశాలు నిర్వహించడంతో రాజకీయాలు చలిలో కూడా వేడి పుట్టిస్తున్నాయి. రాజధాని భవిశ్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యంలో తమ వాదన ప్రజల దృష్టికి తీసుక వెళ్లేందుకు అధికార, విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.