ఇంత తెంపరితనం వెనుక ఏముందో!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో ప్రభుత్వం నడుపుతున్న బిజెపికీ మధ్య రాష్ట్రంలో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్నది. నిజానికి అది ఆశ్యర్యకరమైన విషయమేమీ కాదు. బిజెపి నాయకత్వం తీరు గమనిస్తూ వచ్చిన వారికి ఇది ఆశ్చర్యం కలిగించదు. తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి బిజెపిని తీవ్రంగా ఎదుర్కొనడం మినహా  గత్యంతరం లేకుండా పోయింది.

గత ఎన్నికల ముందు అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించి నవ్యాంధ్రను అనాధలా వదిలేశారన్న కారణంగా కాంగ్రెస్‌పై పెంచుకున్న ఆగ్రహంతో ప్రజలు 2014లో ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించి టిడిపి-బిజెపి సంకీర్ణానికి అధికారం అప్పగించారు. పదేళ్ల కాంగ్రెస్ అవినీతి పాలనతో విసిగిపోయిన దేశ ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఎను ఆదరిస్తారన్న నమ్మకం కూడా ఆంధ్రప్రదేశ్ వోటర్లను ఆ వైపు నడిపించింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకుంటుందన్న విశ్వాసం అందుకు కారణం. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోదీ కూడా తన ప్రసంగాలలో ఆ సంగతే ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రత్యేక హోదా చట్టంలో పెట్టనందుకు కాంగ్రెస్‌ను దునుమాడిన మోదీ దానితో పాటు నవ్యాంధ్రకు బోలెడు వాగ్దానాలు చేశారు.

కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయిన తర్వాత భ్రమలు తొలగిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఆచితూచి వ్యవహరించడం అలవాటైపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కాలం వేచిచూశారు కానీ, మోదీ ఆలోచనలు వేరే ఉన్నాయన్న సంగతి తొందరలోనే స్పష్టమైపోయింది. చివరికి కేంద్రంలో ఉన్నఎన్‌డిఎ నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకోవడంతో దారులు వేరయ్యాయి. అప్పటి నుంచీ టిడిపి, బిజెపి మధ్య వైరం మొదలయింది.

అయితే ప్రత్యేకహోదా అన్నది ఒక సెంటిమెంట్‌గా మారిన నవ్యాంధ్రలో ఆ ఆశ చూపించి ఆపై వంచించిన బిజెపి ఇంత తెంపరితనంతో వ్యవహరించడం ఏమిటి? ప్రజలలో మరింత వ్యతిరేకత మూట కట్టుకుంటామన్న భయం లేకపోవడమేమిటి? నిజానికి ఇవాళ రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ కన్నా బిజెపినే ఎక్కువ పరుషంగా వ్యవహరిస్తున్నది. 2014లో కేంద్రంలో సొంత బలంతో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా బిజెపి శ్రేణులలో తలెత్తిన అతిశయమే ఇక్కడ కూడా బిజెపి నాయకత్వాన్ని ముందుకు నడిపిస్తున్నది. అగ్ర నాయకత్వం అండగా ఉంది కాబట్టి రాష్ట్ర నాయకత్వం మరింత రెచ్చిపోతున్నది. ఎంత ప్రోద్బలం లేకపోతే ప్రధానితో  వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ సోము వీర్రాజు ముఖ్యమంత్రిని పట్టుకుని లుచ్ఛా అనగలరు!

వీటన్నిటికీ తోడు స్థానికంగా బిజెపికి మద్దతు లభిస్తోంది. ప్రత్యేక హోదాకోసం పోరాడుతున్నది తామేనంటున్న వైఎస్‌ఆర్‌సిపి నాయకత్వం లోపాయికారీగా బిజెపికి మద్దతు పలుకుతున్నది. మరోపక్క చంద్రబాబును దెబ్బతీయడమే లక్ష్యంగా పని చేస్తానని బహిరంగంగా చెబుతున్న తెలంగాణా ముఖ్యమంత్రి కూడా బిజెపితో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక బిజెపి తెంపరితనంతో వ్యవహరించకుండా ఎలా ఉంటుంద!

తెంపరితనంతో వ్యవహరించడం వరకూ బాగానే ఉంది కానీ దాని వల్ల ఏం సాధించాలని బిజెపి చూస్తున్నది? రాజకీయాలలో వ్యూహం లేకుండా ఎవరూ ఏమీ చేయరు కదా, పైగా బిజెపి! 2014 నుంచీ బిజెపి అగ్ర నాయకత్వం ఎంత పకడ్బందీ వ్యూహంతో వ్యవహరిస్తున్నదీ మనం చూస్తునే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్‌లో అదేమై ఉండొచ్చు? ఇప్పుడున్న పరిస్థితులలో 2019 ఎన్నికలలో బిజెపి అభ్యర్ధులు ఎక్కడైనా గెలవగలరా అంటే అనుమానమే. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ ఖాతా తెరవక పోయినా చంద్రబాబు నాయకత్వంలోని టిడిపిని ఓడిస్తే చాలని బిజెపి నాయకత్వం భావిస్తోందా? టిడిపి ఓడిందంటే వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చినట్లు. వారి మద్దతు తమకేనన్న ధైర్యం లేకపోతే బిజెపి ఇంత తెంపరితనం చూపిస్తుందా!