‘ఎంపీకే ఇలా జరిగితే మరి సామన్యుడి పరిస్థితి?’

గుంటూరు: శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులే తమపై దురుసుగా ప్రవర్తించారని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్టయిన ఎంపీ గల్లాకు మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనతోపాటు రిమాండ్‌లో ఉన్న మరో ముగ్గురు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలపాలనుకుంటే పోలీసులే తమపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. తనను గోళ్లతో రక్కేశారని, చొక్కా చించేశారని చెప్పారు. బట్టలు కూడా ఊడిపోయాయని తెలిపారు. ఎస్పీ లాఠీ పట్టుకొని బెదిరించారని.. వాళ్లు కొడతారేమోనని భయపడ్డానని ఎంపీ చెప్పారు. దాదాపు 15 గంటల పాటు తనను నరసరావుపేట, రొంపిచర్ల, కొల్లిపారతో పాటు గుంటూరులో తిప్పి.. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారని తెలిపారు.

నరసరావుపేట పీఎస్ లోనే మూడు గంటల పాటు ఉంచారని, స్టేషన్ బయట జనాలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో రొంపిచెర్ల తీసుకెళ్లారన్నారు. అక్కడ కూడా భారీగా జనం వస్తుండడంతో మళ్లీ అక్కడి నుంచి గుంటూరుకు తరలించారని వివరించారు. వైద్య సదుపాయం కావాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమని అరెస్ట్ చేస్తున్నారో, నిర్బంధిస్తున్నారో కూడా పోలీసులు చెప్పలేదని తెలిపారు. పోలీసు జీపులోనే వైద్య పరీక్షలు చేసి…జైలుకి పంపారని మండిపడ్డారు. ఒక ఎంపీకే ఇలా ఉంటే…సామాన్యుల పరిస్థితి ఏంటని గల్లా ప్రశ్నించారు.

ఇటీవల రాజధాని మహిళలు తమను పోలీసులు గిచ్చుతున్నారని చెబితే ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడర్థమైందన్నారు. మామూలుగా గిచ్చడం కాదు, పుండ్లు పడేట్టు గిచ్చుతున్నారని ఆరోపించారు. సీఆర్పీఎఫ్ సిబ్బందితో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులపై ఎవరూ రాళ్లు వేయలేదని, పోలీసులే వాళ్లపై మట్టిపెళ్లలు వేసుకుని కావాలని లాఠీఛార్జ్‌ చేశారని గల్లా జయదేవ్ ఆరోపించారు.