అమరావతి: విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడం ఆపలేదు.
ఇప్పటికే మొన్నటి శాసనసభ ఎన్నికలలో ఎదురయిన ఘోర పరాజయంతో తెలుగుదేశం పార్టీ చతికిలపడిఉంది. ఎక్కువ మంది వైసిపి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించగా గతంలో ఎన్నడూ లేని విధంగా టిడిపి కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యింది.
ఈ ఘోర పరాజయ పరాభవాన్ని దిగమింగుకొని సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్రను పోషించేందుకు 69ఏళ్ల చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభిస్తున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా పార్లమెంట్ సభ్యుడు కేశినేని (శ్రీనివాస్) నాని చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ పరువుప్రతిష్ఠలను వీధికెక్కించే విధంగా ఉన్నాయంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవల పార్లమెంటరీ పార్టీ పదవుల పంపకాల విషయంలో అలిగిన కేశినేని నాని విప్ పదవిని తిరస్కరించారు. ఈ విషయాన్ని పార్టీ అంతర్గత సమావేశాల్లో వెల్లడించకుండా సోషల్ మీడియాకు ఎక్కడంతో అది రచ్చరచ్చ అయ్యింది. అంత పెద్ద పదవికి తాను అర్హుడిని కాదంటూ వ్యగ్యంగా పేర్కొన్నారు. నానిని బుచ్చగించేందుకు గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్‌ను పార్టీ అధినేత చంద్రబాబు ఆయన నివాసానికి పంపినా నాని ఆలకవీడకపోవడంతో చంద్రబాబే రంగంలోకి దిగి ఆయనను ఇంటికి పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంలో పార్టీలో గత ఐదేళ్లుగా ఎదురయిన పరాభవాలను చంద్రబాబు ముందు ఏకరువు పెట్టి నాని వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. చంద్రబాబుతో మాట్లాడి వచ్చిన తరువాత కూడా ‘పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప’ అన్న శ్రీశ్రీ కవితను సోషల్ మీడియాలో నాని పోస్టు చేశారు. దీనిలో ఎంత గూడార్థం ఉందో అందరికీ అర్థం అవుతూనే ఉంది.
తాను పార్టీని వీడను అని ఒకపక్క అంటూనే పార్టీలోని నాయకులపై, ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమపై ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తాజాగా దేవినేని ఉమామహేశ్వరరావును లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
‘కొడాలి నాని తనను మంత్రిని చేసిన దేవినేని ఉమకు జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి’ అని నాని పేర్కొన్నారు. కొడాలి గెలుపునకు ఉమా పరోక్షంగా సహకరించారని అర్థం వచ్చే విధంగా ఈ వ్యాఖ్య చేయడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఒకే పార్టీలో ఉన్నప్పటికీ దేవినేని ఉమామహేశ్వరరావు, కేశినేని నానిల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్నది బహిరంగ రహస్యమే. ప్రస్తుతం తీవ్ర గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్న టిడిపిలో ఈ పరిణామాలు ఎంత వరకు దారి తీస్తాయో వేచి చూడాలి.
https://www.facebook.com/Kesineninani.TDPVijayawada/photos/a.219955028185371/1220647511449446/?type=3